South Central Railway: పట్టాలెక్కనున్న ప్యాసింజర్‌ రైళ్లు!

South Central Railway: Preparation For Issuing Of Regular Train Tickets - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: తక్కువ చార్జీలతో  ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే ప్యాసింజర్‌ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో వివిధ మార్గాల్లో  ప్ర ధాన రైళ్లను పునరుద్ధరించడంతో పాటు ఎంఎంటీఎస్‌ రైళ్లను అందుబాటులోకి  తెచ్చిన దక్షిణమధ్య రైల్వే తాజాగా ప్యాసింజర్‌ రైళ్లపైన దృష్టి సారించింది.

తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 100 ప్యాసింజర్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఉదయాన్నే నగరానికి చేరుకొని తిరిగి సాయంత్రం సొంత ఊళ్లకు వెళ్లే లక్షలాది మందికి ప్యాసింజర్‌ రైళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.  

  •  మేడ్చల్, మనోహరాబాద్, ఉందానగర్, వరంగల్, కాజీపేట్, హన్మకొండ, తాండూ రు, వికారాబాద్, మహబూబ్‌నగర్, కర్నూ లు, నిజామాబాద్, మణుగూరు తదితర ప్రాంతాల నుంచి పుష్‌ఫుల్, డెము, మెము, ప్యాసింజర్‌ రైళ్లు  రాకపోకలు సాగిస్తాయి. 
  • ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం వచ్చే వాళ్లతో పాటు కనీసం 2 లక్షల మంది ప్రయాణికులు ప్యాసింజర్‌ రైళ్లను వినియోగించుకుంటున్నారు. కోవిడ్‌ మహమ్మారి దృష్ట్యా గతేడాది మార్చి 23వ తేదీ నుంచి ఈ రైళ్లను నిలిపివేశారు.  
  • 15 నెలలుగా ప్యాసింజర్‌ రైళ్ల సేవలు స్తంభించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేవలం రూ.100 నెలవారీ పాస్‌లపైన ప్రతి రోజు హైదరాబాద్‌కు వచ్చి పోయే ఎంతోమంది ఉపాధికి విఘాతం కలిగింది. ఎంఎంటీఎస్‌ సర్వీసులకు లభించే ఆదరణ మేరకు జూలై  నుంచి దశలవారీగా ప్యాసింజర్‌ రైళ్లను నడిపేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు.  

ఎంఎంటీఎస్‌ రైళ్లలో 30 శాతం ఆక్యుపెన్సీ 

  • మూడు రోజుల క్రితం పునరుద్ధరించిన ఎంఎంటీఎస్‌ రైళ్లలో  ప్రయాణికుల ఆక్యుపెన్సీ 30 శాతం దాటింది. 
  • ప్రస్తుతం10  రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. 
  • సాధారణ రోజుల్లో 1.5 లక్షల మంది ప్రయాణంచేస్తారు. రోజుకు 121 సర్వీసులు నడుస్తాయి.

అందుబాటులో జనరల్‌ టికెట్లు..

  • గతేడాది లాక్‌డౌన్‌ విధించడంతో పాటే కౌంటర్ల ద్వారా ఇచ్చే జనరల్‌ టికెట్లను కూడా నిలిపివేశారు. సాధారణంగా అప్పటికప్పుడు టికెట్లు కొనుగోలు చేసి వెళ్లే వారు ప్రత్యేకంగా జనరల్‌ టికెట్లకు కూడా రిజర్వు చేసుకోవలసి రావడం ఇబ్బందిగా మారింది. 
  • పైగా ప్యాసింజర్‌ రైళ్లను నిలిపివేయడంతో ఈ టికెట్ల ప్రాధాన్యతను కూడా తగ్గించారు. 
  • తాజాగా ఎంఎంటీఎస్‌ రైళ్లను పునరుద్ధరించడంతో జనరల్‌ టికెట్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. అన్ని ఎంఎంటీఎస్‌స్టేషన్‌లలో ఈ టిక్కెట్లు లభిస్తాయి.  
  • అలాగే  ఆటోమేటిక్‌ టికెట్‌వెండింగ్‌ మిషన్‌లు, యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ప్రయాణికులు ఇప్పుడు  జనరల్‌ టికెట్లను పొందవచ్చు. 
  • ప్రస్తుతానికి ఎంఎంటీఎస్‌ రైళ్ల కోసమే ఈ సదుపాయం ఉంది. 
  • త్వరలో ప్యాసింజర్‌ రైళ్లకు కూడా ఏటీవీఎంలు, యూటీఎస్‌ ద్వారా జనరల్‌ టికెట్లు తీసుకోవచ్చు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top