హైదరాబాద్‌లో ‘స్టెమ్‌ సెల్‌’ ల్యాబ్‌! 

A solution to serious health problems with stem cell therapy  - Sakshi

తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు స్టెమ్‌ సెల్‌ థెరపీతో పరిష్కారం: కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో దేశంలోనే అతి పెద్ద స్టెమ్‌ సెల్‌ తయారీ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ‘స్టెమ్‌ క్యూర్స్‌ కంపెనీ’ప్రకటించింది. సుమారు 54 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో స్టెమ్‌ క్యూర్స్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ సాయిరాం అట్లూరి బోస్టన్‌ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్‌ సెల్‌ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచ వైద్య ఆవిష్కరణలకు తన సొంత నగరమైన హైదరాబాద్‌ హబ్‌గా మారిందంటూ సాయిరాం సంతోషం వ్యక్తం చేశారు.  

నల్లగొండలో సొనాటా కార్యకలాపాలు 
నల్లగొండలో ప్రారంభం కానున్న ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సొనాటా సాఫ్ట్‌వేర్‌ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో సొనాటా సాఫ్ట్‌వేర్‌ 200 ఉద్యోగాలు కల్పిస్తుంది.

బోస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సొనాటా సాఫ్ట్‌వేర్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్  రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌ రెడ్డి, చీఫ్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ అమర్‌నాథ్‌రెడ్డి ఇందుకూరి తదితరులు భేటీలో పాల్గొన్నారు.  

నగరానికి ప్లూమ్, సనోఫీ, పై హెల్త్‌ 
కమ్యూనికేషన్స్‌ సర్విస్‌ ప్రొవైడర్స్‌ (సీఎస్‌పీ), వారి సబ్‌స్రై్కబర్లకు సాస్‌ (సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీస్‌) అనుభూతిని కలిగించిన వేదిక ‘ప్లూమ్‌’హైదరాబాద్‌లో వంద మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. జయేశ్‌ రంజన్‌తో ప్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కిరణ్‌ ఈదర భేటీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

అంతర్జాతీయ ఫార్మా సంస్థ సనోఫీ 350 ఉద్యోగులతో ఒక సెంటర్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సమగ్ర కేన్సర్, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ‘పై హెల్త్‌’సహ వ్యవస్థాపకులు డాక్టర్‌ బాబీ రెడ్డి ప్రకటించారు.  

నిక్కీ హేలీతో కేటీఆర్‌ భేటీ 
ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్‌ కరోలినా గవర్నర్‌ నిక్కీ హేలీతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. భారత్, యూఎస్‌ సంబంధాల్లో హైదరాబాద్, తెలంగాణకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతపై చర్చించారు. ఆర్థిక, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చించడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ హేలీని మంత్రి అభినందించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top