సింగరేణి లాభాలు రూ.1,500 కోట్లు?

Singareni Company Profit Around 1500 Crore Year 2021 22 - Sakshi

నేడు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం

లాభాలు వెల్లడించే అవకాశం

శ్రీరాంపూర్‌(మంచిర్యాల): సింగరేణి సంస్థ 2021–22 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,500 కోట్ల లాభాలు ఆర్జించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో కోల్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత సంవత్సరం సాధించిన బొగ్గు ఉత్పత్తి, అమ్మకాల దృష్ట్యా ఈసారి కూడా అంత మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ 64 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది.

అంతకుముందు 2020–21లో కంపెనీ రూ.273 కోట్ల లాభాలు సాధించింది. మార్కెట్‌లో బొగ్గు డిమాండ్‌ను సింగరేణి సద్వినియోగం చేసుకోవడంతో ఈసారి లాభాలు అనూహ్యంగా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాలు ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో కంపెనీ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ అధ్యక్షతన బుధవారం జరిగే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఉత్కంఠకు తెరపడనుంది.

ఈ సమావేశానికి కోల్‌ సెక్రెటరీలు, సింగరేణి డైరెక్టర్లు, కోలిండియా డైరెక్టర్లు హాజరు కానున్నారు. దీనికి ముందుగా సోమవారం ప్రీబోర్డు సమావేశం జరిగింది. బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో లాభాలతోపాటు ఓసీపీ ఓబీ పనుల టెండర్లు ఖరారు చేయనున్నట్లు తెలిసింది. లాభాల ప్రకటన తర్వాత కంపెనీ అధికారులు, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ నేతలు, టీఆర్‌ఎస్‌ కోల్‌బెల్ట్‌ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి లాభాల వాటా శాతాన్ని ప్రకటించాలని కోరతారని తెలిసింది. క్రితంసారి 29శాతం లాభాల వాటా ప్రకటించిన సీఎం ఈసారి గతం కంటే ఎక్కువ శాతమే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top