
దేశంలో భారీగా తగ్గిన ప్రసూతి, శిశు మరణాలు
లక్షకు 130 నుంచి 93కి తగ్గిన ప్రసూతి మరణాలు
అతి తక్కువ మరణాలు నమోదైన రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ
శాంపిల్ రిజి్రస్టేషన్ సిస్టం నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రసూతి, శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్ష ప్రసవాలకు గతంలో 130 ఉండగా, తాజాగా 93కు తగ్గినట్లు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్‌ఆర్‌ఎస్) నివేదికలో వెల్లడించింది. శిశు మరణాల రేటు కూడా భారీగా తగ్గింది. 2014లో వెయ్యి జననాలకు 39 మరణాలు ఉండగా, 2021 నాటికి 27కు తగ్గినట్లు ఎస్‌ఆర్‌ఎస్ పేర్కొంది.
నవజాత శిశు మరణాల రేటు 2014లో వెయ్యికి 26 ఉండగా, 2021 నాటికి 19కి తగ్గింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటు 2014లో వెయ్యికి 45 ఉండగా, 2021 నాటికి 31కి తగ్గిందని వివరించింది. 2021లో నమోదైన 2.0 శాతం సంతానోత్పత్తి రేటు స్థిరంగా కొనసాగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 7న రిజి్రస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) విడుదల చేసిన ఎస్‌ఆర్‌ఎస్–2021 ప్రకారం తల్లి, శిశు ఆరోగ్య సూచికలలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని తెలిపింది.
తెలంగాణ, ఏపీలో ఇలా..
» ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక ప్రకారం 2030 నాటికి 8 రాష్ట్రాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ)ను సాధిస్తాయని తెలిపింది.
» ప్రసూతి మరణాల రేటు ప్రతి లక్షకు సగటున 70 కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు దేశంలో 8 ఉన్నాయి. అందులో తెలంగాణ, ఏపీ కూడా ఉన్నాయి.
» తెలంగాణలో ప్రసూతి మరణాలు ప్రతి లక్షకు 45 నమోదు కాగా, ఏపీలో 46గా నమోదయ్యాయి. ప్రసూతి మరణాలు అతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. ఐదేళ్ల లోపు శిశు మరణాల సంఖ్య సగటున 25 కన్నా తక్కువ ఉన్న 12 రాష్ట్రాల్లో సైతం ఏపీ, తెలంగాణ చోటు దక్కించుకున్నాయి. ఇది తెలంగాణలో 22 ఉండగా, ఏపీలో 24గా నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.
ప్రసూతి మరణాలు 2014–16లో 130, 2015–17లో 122, 2016–18లో 113, 2017–19లో 103, 2018–20లో 97, 2019–21లో 93గా నమోదయ్యాయి.