డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో సంచలన విషయాలు.. పక్కా స్కెచ్‌తో!

Sensational Facts Woman Kidnap Ranga Reddy Police saved Doctor Vishali - Sakshi

సాక్షి, రంగారెడ్డి: ఆదిభట్లలోని మన్నెగూడలో కిడ్నాప్‌ అయిన డాక్టర్‌ వైశాలి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. యువతిని పక్కా ప్లాన్‌ ప్రకారమే కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. పట్టపగలే 100 మంది ఇంట్లోకి వచ్చి యువతిని కిడ్నాప్‌ చేయడం వెనక స్థానిక పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిడ్నాప్‌కు పాల్పడిన నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు చెబుతున్నారు.  తన కూతురు కిడ్నాప్‌కు మరికొంతమంది స్థానికుల ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు.  కూతురిని నవీన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారే ఒత్తిడి  చేశారని తెలిపారు. నవీన్ రెడ్డితో వివాహం ఇష్టం లేక గతంలో ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. 

పెళ్లిచూపులు ఉన్నాయని తెలిసే
ఇదిలా ఉండగా.. యువతి కిడ్నాప్ వెనుక ప్రేమ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో నవీన్ రెడ్డి, వైశాలి ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకోలేదని గత ఆరు నెలలుగా నవీన్ రెడ్డి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ గతంలో వైశాలి, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే వైశాలి ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకొని టీస్టాల్‌ ఏర్పాటు చేశాడు.

మరో వ్యక్తితో వివాహం చేసుకునేందుకు వైశాలి సిద్ధపడిందని, ఈ రోజు పెళ్లిచూపులు ఉన్నాయని తెలుసుకున్న నవీన్‌ రెడ్డి 100 మంది కిరాయి గుండాలతో దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోకి ప్రవేశించే సమయంలో సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారు.

ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. వైశాలి తండ్రిని, అడ్డుకోబోయిన పలువురు స్థానికులను కూడా చితకబాదారు. యువతి ఇంటి సమీపంలోనే టీస్టాల్‌ నడుపుతున్న నవీన్‌ రెడ్డి.. అక్కడికి వచ్చే వ్యక్తులు, కొంతమంది స్టూడెంట్స్‌కు డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది.  

పథకం ప్రకారమే
యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు. దాడి చేసిన వారిలో ఇప్పటికే 40 మందికి పైగా యువకులను గుర్తించారు. కిడ్నాప్ తర్వాత అమ్మాయిను నవీన్ రెడ్డికి అప్పగించి యువకులు పరారయ్యారు. పథకం ప్రకారమే సెల్ ఫోన్లు వాడకుండా స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. ఎలాంటి ఆధారాలు దొరకవద్దని వైశాలి ఇంటివద్ద పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.  

కిడ్నాప్‌ కేసు కొలిక్కి
సంచలనం సృష్టించిన డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసును పోలీసులు చేధించారు.  వైశాలి తన తల్లిదండ్రులకు కాల్‌ చేయడంతో సెల్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా ఆమెను ట్రేస్‌ చేశారు. యువతి నల్గొండలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  వెంటనే నల్గొండ పోలీసులకు సమాచారం ఇచ్చిన రాచకొండ పోలీసులు వైశాలి ఉన్న స్పాట్‌కు తండ్రితోపాటు వెళ్లారు. కిడ్నాపర్‌ నవీన్‌ను అదుపులోకి తీసుకొని.. వైశాలిని రక్షించారు. కాగా అంతకుముందే వైశాలి తన తల్లిదండ్రులకు కాల్‌ చేసి సేఫ్‌గా ఉన్నట్లు, ఆందోళన చెందవద్దని చెప్పిన సంగతి తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top