
సెలెక్ట్ కాకపోవడంతో డిప్రెషన్‌లోకి....
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి నేరాల బాట
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం...ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసిన సీతయ్య
ఇప్పటికే నగరంలో అనేక కేసులు
తాజాగా అరెస్టు చేసి తీసుకెళ్లిన మహారాష్ట్ర పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అతడి పేరు కిలారు సీతయ్య.. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాడు. పీహెచ్‌డీ పూర్తి చేసి డాక్టరేట్ పొందాడు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అనేక కోచింగ్ సెంటర్లకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి సైబర్ నేరగాడిగా మారాడు. హైదరాబాద్, సైబరాబాద్‌ల్లో అనేక కేసులు నమోదై ఉన్న ఇతగాడు తాజాగా మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్లకు టోకరా వేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పుణే సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం సీతయ్యను యాప్రాల్‌లో అరెస్టు చేసి తీసుకెళ్లారు.
సివిల్స్‌కు ఎంపిక కాకపోవడంతో డిప్రెషన్
ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామకు చెందిన డాక్టర్ సీతయ్య విద్యాభ్యాసం ఏపీ, తెలంగాణల్లో కొనసాగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూకేషన్స్ విభాగంలో మాస్టర్స్ చేయడానికి లండన్ వెళ్లిన ఇతగాడు అక్కడి ఓ ప్రముఖ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశాడు. బాచుపల్లిలో ఉంటూ కొన్నాళ్లు హైదరాబాద్ శివార్లలోని ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు.
వివాహమైన తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారిగా మారాలని భావించి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాశాడు. మొదటి ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. అయితే సెలెక్ట్ కాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లాడు. సీతయ్య ప్రవర్తన మారిపోవడం, ఉద్యోగం కూడా మానేయడంతో భార్య విడాకులు తీసుకుంది. సొంతంగా సివిల్స్ కోచింగ్ సెంటర్ పెట్టాలని భావించినా, అది సాధ్యం కాక కొన్ని సెంటర్లకు విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు.
బెట్టింగ్ వ్యసనంతో నేరగాడిగా మారి...
డిప్రెషన్‌లో ఉన్న సీతయ్య దాని నుంచి బయటపడటానికి ఆన్‌లైన్ గేమింగ్ ఆడటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు అది వ్యసనంగా మారి భారీస్థాయిలో బెట్టింగ్స్ పెట్టాడు. ఈ జల్సాలకు అవసరమైన డబ్బు కోసం సైబర్ నేరగాడిగా మారాడు. మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం వివిధ జాబ్ పోర్టల్స్‌లో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించిన సీతయ్య..వారిని సంప్రదించి దొడ్డిదారిలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎర వేశాడు.
తన వల్లో పడిన వారి నుంచి భారీ మొత్తం వసూలు చేసి వారికి నకిలీ ఆఫర్ లెటర్లు పంపించాడు. కొందరిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలు కూడా చేశాడు. 2023 నుంచి ఈ పంథాలో మోసాలు చేస్తున్న ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్లతోపాటు గచ్చిబౌలి ఠాణాలోనూ అనేక కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లివచ్చినా సీతయ్య పంథా మారలేదు.
ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌గా పుణేలో టోకరా
పుణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ వీసీకి ఈ ఏడాది జూలైలో ఫోన్ చేసిన ఇతగాడు తాను ఐఐటీ బాంబే ప్రొఫెసర్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అంతరిక్ష రంగంలో ఆర్టిఫిషియల్ ఆధారిత ప్రయోగాలు చేపట్టే ప్రాజెక్టులకు తాము ఫండ్స్ ఇస్తున్నామని నమ్మించాడు. సదరు ప్రొఫెసర్ ఈ విషయాన్ని వర్సిటీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయనతో సంప్రదింపులు జరిపాడు. రూ.28 కోట్ల ఫండ్స్ ఇప్పిస్తానంటూ నమ్మించి దఫదఫాలుగా రూ.2.46 కోట్లు కాజేశాడు.
జూలై 25–ఆగస్టు ఏడు మధ్య ఈ లావాదేవీలు జరగ్గా, తాము మోసపోయామని గుర్తించిన వర్సిటీ అధికారులు ఈ నెల మొదటివారంలో పుణే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీతయ్య ఆచూకీ యాప్రాల్‌లో గుర్తించిన అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లారు. పుణే కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదివారం వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మహారాష్ట్రలో ఉన్న మరో రెండు వర్సిటీలకు టోకరా వేయాలని సీతయ్య ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు.