దక్షిణ మధ్య రైల్వే: జహీరాబాద్‌  టు త్రిపుర! | SCR Transports Automobile Goods And Vehicle From Zahirabad To Tripura | Sakshi
Sakshi News home page

దక్షిణ మధ్య రైల్వే: జహీరాబాద్‌  టు త్రిపుర!

Nov 26 2020 8:33 AM | Updated on Nov 26 2020 10:37 AM

SCR Transports Automobile Goods And Vehicle From Zahirabad To Tripura - Sakshi

జహీరాబాద్‌ స్టేషన్‌లో గూడ్స్‌బోగీలోకి వాహనాలను ఎక్కిస్తున్న దృశ్యం

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే తొలిసారి 3,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య రాష్ట్రానికి వాణిజ్య రవాణా వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు అంతదూరంలోని ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే సరుకు రవాణా చేయలేదు. దేశవ్యాప్తంగా సరుకు రవాణాను మరింత పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేకంగా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్లను ప్రారంభించి కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్‌ పరిశ్రమల నుంచి తాజాగా మినీ ట్రక్కులు, గూడ్స్‌ ఆటోలతో కూడిన లోడ్‌ను ఓ ఫ్రైట్‌ రేక్‌ ఈశాన్య రాష్ట్రంలోని త్రిపురకు రవాణా చేసింది. 

రోడ్‌ ట్రాన్స్‌పోర్టుపై భారం తగ్గింపు 
దూర ప్రాంతాలకు ఇప్పటివరకు వాణిజ్యపరంగా సరుకు రవాణా రోడ్డు మార్గం ద్వారానే ఎక్కువగా సాగుతోంది. దీన్ని నియంత్రించటం ద్వారా రోడ్డు రవాణాపై భారాన్ని తగ్గించటంతో పాటు రైలు రవాణాకు లాభాలు పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే రైల్వేకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్ల (బీడీయూ)ను ఏర్పాటు చేసుకుంది. ఆ యూనిట్లు పరిశ్రమలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ బిజినెస్‌ ఆర్డర్లు తెస్తున్నాయి. తాజాగా జహీరాబాద్‌లో ఉన్న ఆటోమొబైల్‌ యూనిట్లపై దృష్టి సారించాయి. ఇక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య వాహనాలు ఉత్పత్తవుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలుతున్నాయి. వాటిని దేశంలో ఏ ప్రాంతానికైనా తరలించేందుకు ప్రత్యేక రేక్స్‌ ఏర్పాటు చేస్తామన్న హామీతో ఆయా యూనిట్లు రైల్వేకు ఆర్డర్లు ఇస్తున్నాయి.  

వసతులు కల్పించడంతో.. 
జహీరాబాద్‌లోని గూడ్స్‌ స్టేషన్‌ను ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేసింది. ఇక్కడ సరైన వసతులు లేక గతేడాది అతికష్టం మీద ఒకే ఒక రేక్‌ (ఒక గూడ్స్‌ రైలు) మాత్రమే లోడైంది. ఇటీవల వసతులు కల్పించటంతో గత ఏప్రిల్‌ నుంచి ఏకంగా 9 రేక్స్‌ల ద్వారా జహీరాబాద్‌ నుంచి 2,500 కి.మీ. దూరంలో ఉన్న అస్సాంలోని ఛాంగ్సరీకి వాణిజ్య వాహనాలను తరలించింది. అయితే అంతకంటే 1,100 కి.మీ. దూరంలో ఉన్న త్రిపురలోని జిరానియాకు వాహనాలు తరలించాలని ఆ కంపెనీ కోరింది. అంతదూరం తరలించే అనుమతి లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా అనుమతి తీసుకుని తాజాగా ఓ రేక్‌ ద్వారా వాణిజ్య వాహనాలను తరలించటం విశేషం. ఇందులో త్రిపురలోని జిరానియా స్టేషన్‌కు 69 మినీ ట్రక్కులు, గూడ్సు ఆటోలతో కూడిన 15 వ్యాగన్లు, అస్సాంలోని ఛాంగ్సరీకి 42 వాహనాలతో కూడిన 10 వ్యాగన్లు కలిపి ఓ రేక్‌ను దక్షిణ మధ్య రైల్వే తరలించింది. దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో తొలిసారి 3,600 కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్‌కు వాహనాలను తరలించి రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆర్డర్లు అధికంగా పొందాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement