ఇదేం ‘శిక్ష’ణ..?.. కోచింగ్‌ పూర్తికాకుండానే సంస్థలకు సొమ్ములు!

Scam exposed in BC Study Circle training programmes at Telangana - Sakshi

బీసీ స్టడీ సర్కిల్‌ శిక్షణ కార్యక్రమాల్లో వెలుగు చూసిన మోసం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా గ్రూప్‌–3, గ్రూప్‌–4 ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చే కాంట్రాక్టులు పొందిన పలు ప్రైవేటు కోచింగ్‌ సంస్థలు శిక్షణ పూర్తి చేయకుండానే సర్కారు సొమ్మును అప్పనంగా దండుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా సంస్థల నిర్వాకంతో విలువైన సమయాన్ని కోల్పోయిన అభ్యర్థులు పలు జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో వాస్తవ పరిస్థితిని సమీక్షించిన అధికారులకు అసలు సంగతి తెలిసింది. ఇంత జరిగినా అధికారులు కేవలం నోటీసులతో సరిపెట్టి ఇక చేసేదేంలేదని చేతులు దులుపుకోవడం గమనార్హం.

‘ప్రైవేటు’కు అప్పగించి...
బీసీ అభ్యర్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ గతేడాది సెపె్టంబర్‌ 15న రాష్ట్రవ్యాప్తంగా 50 స్టడీ సెంటర్లను తెరిచింది. ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేసింది. ఒక్కో అభ్యర్థికి మూడు నెలలపాటు అయ్యే శిక్షణ వ్యయాన్ని రూ. 5 వేల చొప్పున ఖరారు చేశారు. ఈ ఫీజును బీసీ సంక్షేమ శాఖ భరిస్తూ... అభ్యర్థులకు మాత్రం ఉచి­త శిక్షణ ఇచ్చేందుకు స్టడీ సెంటర్లను తెరిచింది. ఈ లెక్కన ఒక్కో కేంద్రంలో 100 మంది అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రూ. 5 లక్షలు ఖర్చు కానుండగా రాష్ట్రవ్యాప్తంగా 50 సెంటర్ల ద్వారా అయ్యే మొత్తం శిక్షణ ఖర్చు రూ. 2.5 కోటు­్లగా ప్రభుత్వం తేల్చింది. ఈ మొత్తంతో అ­భ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను బీసీ స్టడీ సర్కిల్‌ ఏడు ప్రైవే­టు సంస్థలకు కాంట్రాక్టు అప్పగించింది. ఇందు­లో ఒక సంస్థకు ఏకంగా 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు ఇవ్వగా మిగతా ఆరు సెంటర్లకు ఐదేసి సెంటర్ల చొప్పున శిక్షణ బాధ్యతలు ఇచ్చింది.

సబ్‌ కాంట్రాక్టు పేరుతో మాయ..
ఇంతవరకు బాగానే ఉన్నా... శిక్షణ బాధ్యతలు తీసుకున్న ప్రైవేటు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. అభ్యర్థులకు నేరుగా శిక్షణ ఇచ్చే బదులు ఆ బాధ్యతను కొందరికి సబ్‌ కాంట్రాక్టు ఇచ్చాయి. 20 స్టడీ సెంటర్ల బాధ్యతలు తీసుకున్న ఓ కాంట్రాక్టు సంస్థ... కిందిస్థాయిలో ఒక్కో వ్యక్తికి 10 సెంటర్ల చొప్పున రూ. 7.5 లక్షలకు సబ్‌ కాంట్రాక్టు ఇచ్చినట్లు తెలిసింది. అయితే సబ్‌ కాంట్రాక్టు పొందిన వాళ్లంతా తరగతులు ప్రారంభించి దాదాపు నెల రోజులు నిర్వహించిన అనంతరం అప్పటివరకు చెప్పిన క్లాసులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టు తీసుకున్న సంస్థలను డిమాండ్‌ చేశారు. కానీ కాంట్రాక్టు సంస్థలు పట్టించుకోకపోవడంతో సబ్‌ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ తరగతులను నిలిపివేశాయి. దీంతో అర్ధంతరంగా కోచింగ్‌ నిలిచిపోవడంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కామారెడ్డి, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లోని బీసీ స్టడీ సెంటర్ల నిర్వహణపై అభ్యర్థులు జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేయగా మరికొన్ని జిల్లాల్లో అభ్యర్థులను స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. మరోవైపు దీనిపై వివాదం కొనసాగుతుండగానే శిక్షణ గడువు ముగిసిందంటూ కాంట్రాక్టు సంస్థలు బీసీ స్టడీ సర్కిల్‌ నుంచి బిల్లులు డ్రా చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

నోటీసులిచ్చినా స్పందించలేదు..
కలెక్టర్ల ఆదేశంతో రంగంలోకి దిగిన బీసీ సంక్షేమ అధికారులు వాస్తవ పరిస్థితులను గుర్తించి బీసీ స్టడీ సర్కిల్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ ఇటీవల కాంట్రాక్టు పొందిన ప్రైవేటు సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అవకతవకలపై వెంటనే వివరణ ఇవ్వాలని పేర్కొంది. కానీ ఈ నోటీసులకు ఆయా సంస్థల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.

అర్ధంతరంగా ఆపేస్తే ఎలా?
గ్రూప్‌–3, గ్రూప్‌–4 పోస్టులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అనగానే సంబరపడ్డా. నారాయణపేట జిల్లాలోని బీసీ స్టడీ సెంటర్‌లో కోచింగ్‌కు వెళ్లా. దాదాపు నెలన్నర తరగతుల అనంతరం శిక్షణను అర్ధంతరంగా ఆపేశారు. దీంతో సిలబస్‌ పూర్తికాక, ఇతర కోచింగ్‌ సెంటర్లకు వెళ్లే పరిస్థితి సతమతమవుతున్నా.
– శ్వేత, బొమ్మన్‌పాడ్, నారాయణపేట జిల్లా  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top