‘ఆర్టీసీ’ డ్రైవింగ్‌ స్కూల్‌

RTC Driving Training Center Has Been Set Up At Jagittala Depot - Sakshi

ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో యువతకు డ్రైవింగ్‌ శిక్షణ

30రోజుల పాటు బస్సు  నడపడంలో మెలకువలు

సంస్థకు ఆదాయం..యువతకు ఉపాధి అవకాశం 

కరీంనగర్, జగిత్యాలలో కొనసాగుతున్న శిక్షణ

జగిత్యాలటౌన్‌: ఉద్యోగం లేని యువతకు ఉపాధిమార్గం చూపుతోంది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. ఇదే క్రమంలో నష్టాల్లో కొనసాగుతున్న సంస్థకు ఆదాయాన్ని సాధించేలా వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే కార్గోబస్సులతో మంచి లాభాన్ని గడిస్తున్న సంస్థ.. ‘ఆర్టీసీ’ డ్రైవింగ్‌ స్కూళ్లను ప్రారంభించింది. సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలుస్తున్న ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా జగిత్యాల డిపోలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్‌ శిక్షణ పొందుతోంది.

తొలి శిక్షణకేంద్రం జగిత్యాలలో..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాకు ఒక డిపోలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఆర్టీసీలోని సీనియర్‌ డ్రైవర్లతో నెలరోజుల పాటు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ ఇప్పించి, స్వయం ఉపాధి సాధించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసీ డ్రైవింగ్‌ శిక్షణకేంద్రాన్ని జగిత్యాల డిపో ఆధ్వర్యంలో జనవరి 17న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మూడో బ్యాచ్‌ శిక్షణ పొందుతోంది. కరీంనగర్‌–2 డిపో ఆధ్వర్యంలోనూ ఫిబ్రవరి 2 నుంచి శిక్షణ ఇస్తున్నారు.

ఫీజు రూ.15,600.. బ్యాచ్‌కు 16మంది
డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న వారు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారిలో నెలకో బ్యాచ్‌ చొప్పున 16మందిని ఎంపికచేసి 30రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.15,600 ఫీజుగా వసూలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ స్పాన్సర్‌ చేస్తే ప్రభుత్వమే పూర్తిఫీజు భరిస్తుందని జగిత్యాల డిపో మేనేజరు జగదీశ్‌ వివరించారు.

నెలరోజుల పాటు శిక్షణ
ఒక్కోబ్యాచ్‌కు నాలుగువారాల పాటు డ్రైవింగ్‌ శిక్షణ ఇస్తారు. కేవలం డ్రైవింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా ప్రొఫెషనల్స్‌గా తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి ఐదురోజులు బస్సు విడిభాగాలపై, కండీషన్‌ గుర్తింపు, బ్రేక్‌డౌన్‌ అయిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆర్టీసీ మెకానికల్‌ ఇంజినీర్, బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్, డ్రైవింగ్‌ శిక్షకులతో థియరీ క్లాసులు చెబుతారు. అనంతరం 25రోజుల పాటు డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తారు. బ్యాచ్‌లో 16మంది ఉంటే.. ఒక్కొక్కరికి అరగంట పాటు స్టీరింగ్‌ కేటాయిస్తారు.

ఉపాధికి అవకాశం..
30రోజుల శిక్షణ అనంతరం అభ్యర్థులకు ఆర్టీసీ సంస్థ నుంచి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. భవిష్యత్‌లో సంస్థలో డ్రైవర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ పడినప్పుడు ప్రాధాన్యం కల్పిస్తారు. సింగరేణి, కోర్టు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో డ్రైవర్‌ ఉద్యోగాలు సాధించేందుకు ఈ శిక్షణ, ధ్రువీకరణ పత్రం ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఎక్కువగా యువత గల్ఫ్‌ వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవింగ్‌ శిక్షణను సద్వినియోగం చేసుకుంటే.. విదేశాల్లో సైతం మంచి ఉపాధి లభిస్తుందని జగిత్యాల డిపో మేనేజర్‌ జగదీశ్‌ తెలిపారు.శిక్షణకు ప్రత్యేక బస్సు..అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచారు. శిక్షణ బస్సులకు డ్యూయల్‌ స్టీరింగ్, సీట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరి వద్ద క్లచ్, బ్రేక్, ఎక్స్‌లేటర్‌ ఏర్పాటు చేశారు. అభ్యర్థులను ఒకవైపు కూర్చోబెట్టి.. మరోవైపు శిక్షకులు మెలకువలు నేర్పిస్తారు. రద్దీరోడ్లు, ఖాళీరోడ్లు, నైట్‌ డ్రైవింగ్, జిగ్‌జాగ్‌ ట్రాఫిక్‌ ప్రాంతాలతో పాటు ఘాట్‌రోడ్లపై శిక్షణ ఇస్తారు.

డ్రైవింగ్‌ అంటే ఇష్టం
ఆర్టీసీ సంస్థ ఇచ్చే డ్రైవింగ్‌ సర్టిఫికెట్‌తో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిసి ట్రైనింగ్‌లో జాయిన్‌ అయ్యాను. రోజు క్లాస్లులకు హాజరవుతున్నా. థియరీ క్లాసులు పూర్తయ్యాయి. రోడ్డుమీద బస్సు నడుపుతున్నా. ముందు శిక్షకుడి సహాయంతో నడిపాను, ప్రస్తుతం సొంతగా నడపగలుగుతున్నా. 
– బి. వెంకటేశ్, ల్యాగలమర్రి

ఉపాధికి భరోసా 
మాది గొల్లపల్లి మండలం లొత్తునూర్‌ గ్రామం. డ్రైవింగ్‌నే ఉపాధిగా ఎంచుకుని శిక్షణకు వస్తున్నా. ఆర్టీసీలో డ్రైవింగ్‌తో పూర్తిస్థాయిలో బస్సు నడపడం నేర్చుకున్నాను. డ్రైవింగ్‌తో ఉపాధి పొందగలుగుతానని విశ్వాసం కలిగింది.
– జయాకర్, లొత్తునూర్‌

ప్రొఫెషనల్‌గా   తయారు చేస్తున్నాం 
ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టీసీ ట్రైనింగ్‌లో ప్రొఫెషనల్‌ డ్రైవర్లను తయారు చేస్తున్నాం. పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉద్యోగ, ఉపాధి పొందేలా తీర్చిదిద్దుతున్నాం. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌ సైతం ఇస్తున్నాం.    
– జగదీశ్, జగిత్యాల డిపో మేనేజర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top