నూతన వ్యవస్థ కోసం పార్టీ స్థాపిస్తాం

Retired IAS Officer Akunuri Murali Comments On Telangana - Sakshi

ఏపీలో విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ

ఇక్కడ మాత్రం పట్టించుకునే వారే లేరు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి 

సింగరేణి(కొత్తగూడెం): రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారంలా మారాయని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం నాయకులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి వ్యాఖ్యానించారు. ఉద్యమం పేరుతో ప్రజాభిమానాన్ని చూరగొని.. నీళ్లు, నిధులు, ఉద్యోగాల పేరుతో అందలమెక్కిన టీఆర్‌ఎస్‌ హయాంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు. ఇలాంటి సమాజంలో మార్పు తీసుకురావడమే కాకుండా నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిస్వార్థపరులు, వీఆర్‌ఎస్‌ తీసుకున్న అధికారులు, మేధావులతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటిస్తామని మురళి వెల్లడించారు.

గురువారం కొత్తగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీకి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రతీనెల డీఈఓలు, ఎంఈఓలతో సమీక్షిస్తుండగా తెలంగాణలో కనీసం గంటసేపు కూడా సమీక్షించిన నాథులే లేరని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం రూ.7,268 కోట్లతో మన ఊరు – మన బడి పథకాన్ని మొదలుపెట్టినా నేటికీ అతీగతీ లేకుండా పోయిందన్నారు. 2014 నుంచి కేంద్రప్రభుత్వం సుమారు రూ.10 లక్షల కోట్ల మేర బడా కంపెనీలు, వ్యాపారుల రుణాలను మాఫీ చేసిందని.. ఇందులో దేశంలోని 10 లక్షల పాఠశాలలకు రూ.కోటి చొప్పున కేటాయించినా అద్భుతమైన ఫలితాలు వచ్చేవని ఆయన అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top