ఊహలు గుసగుసలాడే..! | Rare rock paintings discovered in Mulugu district | Sakshi
Sakshi News home page

ఊహలు గుసగుసలాడే..!

Jul 3 2026 3:13 AM | Updated on Jul 3 2026 3:13 AM

Rare rock paintings discovered in Mulugu district

కళాత్మక నగిశీలతో తీర్చి దిద్దిన మానవాకృతి , ఏఐ దీన్ని ఇలా స్పష్టంగా తీర్చిదిద్దింది

మదిలో మెదిలిన ఆలోచనలకు రూపమిచ్చిన ఆదిమానవులు

3 వేల ఏళ్ల క్రితం కళాత్మక నగిషీలు,అలంకారాలతో మనిషి చిత్రాలు 

అప్పటికి ఆచరణలోకి రాని తరహాలోఊహా చిత్రాలు  

ములుగు జిల్లాలో వెలుగుచూసిన అతి అరుదైన రాతి వర్ణ చిత్రాలు

సాక్షి, హైదరాబాద్‌: ఊహలకు రెక్కలు రావటం, వాటికి ఓ రూపం ఇవ్వడం ఇప్పుడే కాదు, రాతియుగంలోనూ ఉంది. ములుగు జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన అతి అరుదైన రాతి వర్ణ చిత్రాలే ఇందుకు నిదర్శనం. బృహత్‌ శిలా యుగంలో మనిషి కొన్ని అలంకార వస్తువులను రూపొందించే సృజనను సొంతం చేసుకున్నప్పటికీ, వ్రస్తాలు, శరీరంపై ధరించే ఆభరణాలను తయారు చేసుకోవటం మాత్రం తెలియని కాలం. 

అయితే మనిషి చిత్రాన్ని నిలువెల్లా అలంకరిస్తూ తమ ఊహకు ప్రాణం పోశారు ఆదిమానవులు. మన చరిత్రలో కొత్త కోణాలను ఆవిష్కరించేందుకు ఉపకరించేలా ములుగు పట్టణానికి 30 కి.మీ. దూరంలోని బండ్లపహాడ్‌ అటవీప్రాంతం మొద్దు గుట్ట, దర్వాజాల గుట్ట, నెమలిగుట్టల్లో ఈ చిత్రాలు వెలుగుచూశాయి.  

గుట్ట గుహల్లో రంగు చిత్రాలు
‘పబ్లిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్‌ హెరిటేజ్‌ (ప్రిహా)’సభ్యులైన గడ్డం క్రాంతికుమార్, తాటి సాంబశివరావు తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.శ్రీనివాసన్‌ నేతృత్వంలో ఈ చిత్రాలను వెలుగులోకి తెచ్చారు. ఆదిమానవుల వేల ఏళ్ల పరిణామ క్రమానికి ఆ ప్రాంతం సాక్ష్యంగా నిలిచింది. అక్కడ వారి మనుగడకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. కాగా 10 వేల ఏళ్ల నుంచి వేయి సంవత్సరాల క్రితం వరకు అంటే మధ్యరాతియుగం, కొత్త రాతియుగం, బృహత్‌శిలాయగం కాలాల్లో ఈ ప్రాంతాల్లోని గుట్ట గుహల్లో రంగు చిత్రాలు గీశారు. 

వేల ఏళ్ల కాలంలో ఒక కాలం నాటి చిత్రాలపై మరో కాలంలో సూపర్‌ ఇంపోజ్‌ చేశారు. మానవాకృతులు, జింక, ఎద్దు, తాబేలు, నక్క, నెమలి, అడవి దున్న లాంటి చిత్రాలున్నాయి. కొన్ని అంతుచిక్కని గీతలతో కూడిన డిజైన్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఎరుపు, కొన్ని తెలుపు రంగుల్లో ఉన్నాయి. కాలక్రమంలో కొన్ని కొంత మలిగిపోగా, కొన్ని బండరాళ్ల పెచ్చులూడి కొంతమేర కనుమరుగయ్యాయి. 

అరుదైన మానవాకృతి చిత్రాలు 
మానవాకృతి చిత్రాలు వీటిల్లో అత్యంత అరుదైనవి. నిలువెత్తు చిత్రాల్లో ఓ నిలువు మనిషి చిత్రంలో శరీరం యావత్తు డిజైన్‌తో నింపేసి ఉంది. డిజైన్లతో కూడిన చొక్కా వేసుకుని, శరీరం నిండా ఆభణాలు ధరిస్తే ఎలా ఉంటుందో అలా కనిపిస్తోంది. కానీ అప్పటికి వస్త్రధారణ పద్ధతి లేనందున, వాస్తవానికి అది చొక్కా కాదు, కానీ డిజైన్ల వల్ల అలా కనిపిస్తోంది. అంటే ఆ కాలంలో లేనిదాన్ని ఊహాజనితంగా గీశారన్నమాట. ఇక అడ్డంగా ఉన్న మనిషి బొమ్మ తల నుంచి మిగతా భాగాలన్నీ అలంకరణలతో నింపేశారు. దాన్ని చూస్తే ఈ కాలం మోడ్రన్‌ ఆర్ట్‌ స్ఫురణకొస్తుంది.

ఇందులో రకరకాల ఆకృతులతో అద్భుత కాన్వాసులాగా మార్చారు. ‘గతంలో బొమ్మల లొద్దిలో గుర్తించిన కళాత్మక మానవాకృతి చిత్రాలతో పోలిస్తే ఇది మరింత భిన్నంగా, కొత్తగా కనిపిస్తోంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదు, భిన్నమైనవి..’అని శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. ‘ఇంతటి కళాత్మక చిత్రాలను నేను ఇప్పటివరకు చూడలేదు. చాలా అరుదైన ఈ చిత్రాలను కాపాడాల్సిన అవసరం ఉంది, వీటి ఆధారంగా పరిశోధిస్తే చరిత్రలో కొత్త కోణాలు వెలుగుచూస్తాయి..’అని ఆదిమానవుల చిత్రాల నిపుణులు డాక్టర్‌ బండి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రాలను రసాయన ప్రక్రియ ద్వారా మెరుగ్గా మార్చి భావితరాలు చూసేందుకు వీలుగా పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement