సిరిసిల్ల జిల్లా అరుదైన ఫీట్‌: సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్‌

Rajanna Sircilla Vaccinated 98 Percentage: KTR Congratulates - Sakshi

జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్‌

ట్విటర్‌లో అభినందించిన మంత్రి కేటీఆర్‌

వంద శాతం దిశగా అడుగులు

మరో 558 మందికి వ్యాక్సినేషన్‌

టీకాలకు 4.60 లక్షల మంది గుర్తింపు.. 4.55 లక్షల మందికి పూర్తి

జిల్లాలో 186 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌

135 గ్రామాల్లో వంద శాతం పూర్తి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కె.తారక రామారావు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావు, వైద్య సిబ్బందిని ట్విటర్‌లో బుధవారం అభినందించారు. జిల్లాలో 18 ఏళ్లు దాటిన వారిలో 98 శాతం మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేటలో ఇప్పటికే 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఇదే స్ఫూర్తితో జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు.
చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్‌

కొత్తగా 558 మందికి వ్యాక్సినేషన్‌
జిల్లాలో బుధవారం 558 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. కోవిడ్‌ పరీక్షలు 2,326 మందికి చేయగా మరో ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వేములవాడలో రెండు, ఇల్లంతకుంటలో ఒక్క కేసు ఉంది. ప్రస్తుతం 193 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనాతో ఒకరు మరణించారు. దీంతో జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 564కు చేరింది.

పొలాల బాట పట్టిన వైద్యసిబ్బంది
కరోనా వైరస్‌ నివారణకు జిల్లా వైద్యసిబ్బంది ఆదర్శంగా నిలుస్తున్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. టీకా తీసుకోవడంతోనే కరోనా వైరస్‌ను ఎదుర్కొనవచ్చని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఇంటింటికెళ్లి వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. జిల్లాలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం 18 ఏళ్లు పైబడ్డ 4,60,859 మందిని గుర్తించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ చేస్తున్న కృషితోనే ప్రస్తుతం జిల్లాలో 135 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

ప్రత్యేక కార్యాచరణతో వ్యాక్సినేషన్‌
జిల్లాలో వైద్యశాఖ అధికారులు వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 89 ఉపఆరోగ్యకేంద్రాలలో క్షేత్రస్థాయి సిబ్బందితో టీకా తీసుకోని వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. టీకా తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌ సోకినా ఆస్పత్రికి వెళ్తే పరిస్థితులు రావని అవగాహన కల్పిస్తున్నారు. పొలాల వద్దకు వెళ్లి మరీ టీకాలు ఇస్తున్నారు. పనిచేసుకుంటున్న వారి వద్దకు వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహించారు. జిల్లాలో తొలి, రెండో డోసులను 4,55,544 మందికి ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో టీకా తీసుకోని వారు 53 వేల మందిని గుర్తించారు. ఏఎన్‌ఎంలు నిత్యం 13 వేల నుంచి 15 వేల మందికి టీకా ఇస్తున్నారు. ఈ లెక్కన మూడు, నాలుగు రోజుల్లో అందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ప్రత్యేక సందర్భాల్లోనే టీకాకు దూరం
జిల్లాలో దాదాపు నూరుశాతం వ్యాక్సినేషన్‌ అయ్యిందని చెప్పుకోవచ్చు. బాలింతలు, గర్భిణులు, కరోనా పాజిటివ్‌ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు, వివిధ జబ్బులతో ఆసుపత్రులలో చికిత్సలు పొందుతున్నవారు మాత్రమే కరోనా టీకా తీసుకోలేదు. ఇలాంటి వారు 5,335 మంది ఉన్నట్లు వైద్యశాఖ గుర్తించింది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top