హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం | Rains in Telangana | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మళ్లీ వర్షాలు

Oct 12 2020 12:49 PM | Updated on Oct 12 2020 1:05 PM

Rains in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో రెండ్రోజుల క్రితం ​ఏర్పడిన అల్పపీడనం తీవ్రత పెరిగి వాయుగుండంగా మారింది. దీంతో తెలంగాణతో పాటు హైదరాబాద్‌లోనూ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ఉదయం నగరంలో పలుచోట్ల వర్షం పడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, అబిడ్స్‌, కోఠి, దిల్‌సుఖ్‌ నగర్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, సరూర్‌ నగర్‌, మల్కాజ్‌గిరి, కాప్రా, ఏఎస్‌రావు నగర్‌లో వర్షం కురుస్తోంది.

వాయుగుండం రానున్న 24గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశాగా ప్రయాణించి ఈనెల 12వ తేదీ రాత్రి ఉత్తర ఆంద్రప్రదేశ్‌లోని నర్సాపూర్‌, విశాఖపట్నం తీరప్రాంతాన్ని దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

రానున్న రెండ్రోజుల్లో రాష్ట్రంలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి , నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల,  భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాలలోని ఒకట్రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు, మిగతా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

ఈనెల 14న మరో అల్పపీడనం...
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఈనెల 12వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే క్రమంలో ఈనెల 14న ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో సుమారు అక్టోబరు 14న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈమేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు కురిసన వార్షాలతో మెజార్టీ ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండినందున అలుగు పారే అవకాశం ఉందని, దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను తరలించాలని,  ప్రత్యమ్నాయ ఏర్పాట్లు సైతం చేసుకోవాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement