ఉస్మానియా వైద్య కాలేజీలో ర్యాగింగ్‌ | Ragging at Osmania Medical College | Sakshi
Sakshi News home page

ఉస్మానియా వైద్య కాలేజీలో ర్యాగింగ్‌

Jun 18 2026 3:10 AM | Updated on Jun 18 2026 3:10 AM

Ragging at Osmania Medical College

కొన్ని నెలలుగా జూనియర్లను ర్యాగింగ్‌ చేస్తున్న సీనియర్లు

12 మంది సీనియర్‌ విద్యార్థుల సస్పెన్షన్‌

సుల్తాన్‌బజార్‌ (హైదరాబాద్‌): రాష్ట్రంలో పేరొందిన కోఠి ఉస్మానియా వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ భూతం పడగవిప్పింది. ఈ కళాశాల హాస్టల్‌లో ఉంటున్న సీనియర్‌ విద్యార్థులు, జూనియర్‌ విద్యార్థులను తమ సొంత పనులకు వినియోగించుకుంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డెంటల్‌ కళాశాలలో అభ్యసించే 2025 బ్యాచ్‌కు చెందిన 14 మంది విద్యార్థులను బీడీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ వైద్య విద్యార్థులు మూడు నాలుగు నెలల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై జూనియర్‌ విద్యార్థులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన నామమాత్రంగా సీనియర్లను మందలించారు. 

సీనియర్‌ చెప్పిన పనులు చేయకపోవ డంతో వారు దాడులకు పాల్పడుతున్నారంటూ బాధితులు సుల్తాన్‌బజార్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2020 బ్యాచ్‌కు చెందిన 12 మంది బీడీఎస్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఖైరతా బాద్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి పర్యవేక్షణలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

అడ్మిషన్‌ దశలోనే అవగాహన కల్పించాలి: డీసీపీ
ర్యాగింగ్‌ చట్టాలపై విద్యార్థులకు అడ్మిషన్‌ దశలోనే విద్యాసంస్థల అధికారులు అవగాహన కల్పించాలని డీసీపీ శిల్పవల్లి సూచించారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్‌ సస్పెండ్‌ చేశారని ఆమె తెలిపారు. ర్యాగింగ్‌ చట్టాల ప్రకారం... ఆరు నెలల శిక్ష పడుతుందని, అదే ర్యాగింగ్‌ వల్ల బాధితులు ఆత్మహత్యకు పాల్పడితే జీవితకాలం శిక్ష పడుతుందన్నారు. అంతేకాకుండా ఇతర విద్యాసంస్థల్లో అడ్మిషన్లు దొరకకుండా చర్యలు ఉంటాయని తెలిపారు. విద్యాసంస్థలు యాంటీ ర్యాగింగ్‌ కమిటీలు, స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి విద్యార్థులపై నిఘా ఉంచాలని సూచించారు.

ఆర్కిటెక్చర్‌ విద్యార్థినిపై లైంగిక వేధింపులు!
ఓక్సన్‌ వర్సిటీలో ఈవెంట్‌ సందర్భంగా ఘటన
ఆలస్యంగా వెలుగుచూసిన వైనం    
నాంపల్లి: ఆర్కిటెక్చర్‌ విద్యార్థినిపై ఓ కాంట్రాక్టు అధ్యాపకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని కంకోల్‌లో ఉన్న ఓక్సన్‌ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. ఈ నెల 11–14వ తేదీల మధ్యన ఓక్సన్‌ వర్సిటీలో 68వ వార్షిక నాసా కన్వెన్షన్‌ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన కన్వెన్షన్‌కు దేశవ్యాప్తంగా వివిధ కళాశాలలు, వర్సిటీల్లో చదివే ఆర్కిటెక్చర్‌ విద్యార్థులు, డిజైనర్లు పాల్గొన్నారు. 

ఈ సెమినార్‌కు మాసబ్‌ట్యాంక్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాలకు చెందిన 50 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరితో పాటుగా కళాశాలకు చెందిన కొందరు అధ్యాపకులు కూడా వెళ్లారు. కాగా, మాసబ్‌ట్యాంక్‌ నుంచి సెమినార్‌కు వెళ్లిన ఆర్కిటెక్చర్‌ అధ్యాపకుల్లో (ఫ్యాకల్టీ) ఒకరైన ఆదిత్య మూర్తి తమ కళాశాలలో ఆర్కిటెక్చర్‌ కోర్సును అభ్యసించే మొదటి సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

సదరు విద్యార్థిని సెమినార్‌ ముగియగానే విషయం తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో సోమవారం వారు ప్రిన్సిపాల్‌ వినోద్‌ గణేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం దాచిపెట్టింది. కాగా, ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామని, నిజనిర్ధారణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయడానికి యూనివర్సిటీకి లేఖ రాశామని వినోద్‌ గణేశ్‌ తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement