సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. 

Racers Are Ready For Formula ePrix Competitions In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఫార్ములా– ఈ ప్రిక్స్‌కు వేళయింది. దేశంలోనే తొలిసారిగా నగరం వేదికగా జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు రేసర్లు  సమరోత్సాహాంతో సన్నద్ధమవుతున్నారు. వీరంతా ఇప్పటికే నగరానికి  చేరుకున్నారు.వివిధ దేశాల్లో నిర్వహించిన ఫార్ములా పోటీల్లో అద్భుతమైన ప్రతిభను, నైపుణ్యాన్ని ప్రదర్శించిన 22 మంది రేసర్లు పాల్గొంటారు. గురువారం   ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు రేసర్లు గతంలో నిర్వహించిన పోటీలపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా రేసింగ్‌ డ్రైవర్లు జీన్‌ ఎరిక్‌ వర్జిన్, ఆండ్రే లాట్టర్‌లు తమ అనుభవాలను వివరించారు. పోటీల్లో  పాల్గొనడం ఎంతో ఆసక్తికరంగా ఉందన్నారు. పోటీల్లో పాల్గొనడానికి ముందు ఒత్తిడిని తగ్గించుకొనేందుకు తాను మైకేల్‌ జాక్సన్‌ పాటలు వింటానని ఆండ్రే  చెప్పారు. రేసింగ్‌ డ్రైవర్‌లపై తప్పనిసరిగా మానసిక ఒత్తిడి ఉంటుందని, దానిని అధిగమించేందుకు  వివిధ రకాల పద్ధతులను పాటిస్తామన్నారు. వీలైనంత వరకు  చుట్టూ ఉండే వాతావరణాన్ని  ఆహ్లాదభరింతగా ఉంచుకోనున్నట్లు చెప్పారు. 

మరోవైపు  మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి ఇబ్బందులను అధిగమించేందుకు  సైకాలజిస్టులను కూడా సంప్రదిస్తామని  చెప్పారు. కాగా.. ఫార్ములా– ఈ పోటీల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నెక్లెస్‌రోడ్డులోని  2.8 కి.మీ ట్రాక్‌ను సిద్ధం చేశారు. 20 వేల మందికి పైగా సందర్శకులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో భారీ స్క్రీన్‌లను  ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 11 ఆటోమొబైల్‌  దిగ్గజ సంస్థలకు చెందిన సింగిల్‌ సీటర్‌ ఎలక్ట్రిక్‌ కార్లు, 22 మంది రేసింగ్‌ డ్రైవర్లు పోటీల్లో పాల్గోనున్న సంగతి  తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top