
59–జీవో దరఖాస్తులు 20 నెలలుగా పెండింగ్‌లోనే..
ప్రభుత్వ భూముల్లోని తమ నివాసాలు క్రమబద్ధీకరించాలంటూ విజ్ఞప్తులు
సీఎంతో పాటు రెవెన్యూ మంత్రిపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి
ఈ నెలలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో పెట్టిన జీవో 59 అమలు కోసం ఒత్తిడి పెరుగుతోంది. గత 20 నెలల కాలంగా తమ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్‌లో ఉన్నాయని, వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకుని తాము నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కారణంతో తమ దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడం సమంజసం కాదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు దరఖాస్తుదారులు వస్తున్నారని, మరోవైపు ముఖ్యమంత్రితో పాటు రెవెన్యూ శాఖ మంత్రిపై కూడా పలువురు ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జీవో 59 ద్వారా ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ విషయంలో ఈ నెలలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దరఖాస్తుదారులకు మరోమారు నోటీసులిచ్చి, అవసరాన్ని బట్టి ఆ భూములపై మరోమారు కూలంకషంగా విచారణ జరిపి అర్హులకు క్రమబద్ధీకరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆ శాఖ వర్గాలంటున్నాయి.
కేబినెట్ సబ్ కమిటీకి ఇప్పటికే నివేదిక
ఆదాయ వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీకి గతంలోనే రెవెన్యూ శాఖ జీవో 59కి సంబంధించిన నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. జీవో 59 కింద మొత్తం 57,661 దరఖాస్తులు రాగా, 55,997 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే 32,788 దరఖాస్తులకు డిమాండ్ నోటీసులు కూడా జారీ చేశారు.
వీరిలో 13,726 మంది డిమాండ్ మేరకు ప్రభుత్వానికి చెల్లింపులు చేశారు. దీంతో 10,553 మంది కన్వేయన్స్ డీడ్‌లు కూడా మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల్లో 828 దరఖాస్తులు అధిక విలువ ఉన్న భూములకు సంబంధించినవని, సాధారణ విలువ ఉన్న పెండింగ్ దరఖాస్తుల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లు ప్రభుత్వానికి సమకూరుతుందని, అధిక విలువ గల భూములను కూడా క్రమబద్ధీకరిస్తే మరో రూ.5 వేల కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఆ నివేదికలో పేర్కొన్నారు.
అయితే కన్వేయన్స్ డీడ్స్ వచ్చినప్పటికీ సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో జీవో 59 క్రమబద్ధీకరణ భూములపై లావాదేవీలు నిర్వహించవద్దని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశీలన పూర్తయిన దరఖాస్తులు, మార్కెట్ విలువ చెల్లించినవి, డీడ్స్ జారీ అయి కూడా పెండింగ్‌లో ఉన్నవి, అధిక విలువ కలిగిన భూములు... ఇలా పలు దశల్లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే దిశలో త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది.