ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది.. | Sakshi
Sakshi News home page

ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది..

Published Sun, Aug 6 2023 7:19 PM

Psephologist AARAA Paying Tributes To Telangana Poet Gaddar - Sakshi

ప్రజా యుద్ధ నౌక ఆగిపోయింది  నిత్యం ప్రజల కోసం, పీడిత - తాడిత వర్గాల కోసం పాటుపడిన గుమ్మడి విఠల్ రావు ఉరఫ్ గద్దర్ గారు ఈరోజు శివైక్యం చెందారు. తాను నమ్మిన సిద్ధాంతం వేలాది మందిని, ఉద్యమాల వైపు నడిపించినా, చివర్లో తాను నమ్మిన సిద్ధాంతం బుల్లెట్ కంటే, బ్యాలెట్ మాత్రమే ప్రజల తలరాతలను మార్చుతుందని... నమ్మిన అతి అరుదైన ఉద్యమ నాయకుడు. తన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు తీవ్ర వ్యతిరేకమైన…దేవతారాధనను, తన జీవిత చరమాంకంలో... నమ్మిన, కనపడని ఆధ్యాత్మికవాది శ్రీ గద్దర్ గారు.   గడిచిన 15 సంవత్సరాల పరిచయంలో ప్రతి నిత్యం నా శ్రేయస్సును కాంక్షించారు.

తన కుమారుడు సూర్యం ద్వారా, నేను ఆ కుటుంబానికి దగ్గరయ్యాను. అనేక సందర్భాల్లో శ్రీ గద్దర్ గారిని కలుస్తూ, అనేక విషయాలపై చర్చిస్తూ.. “అరే నాన్న” అని పిలిచే వారు. తన జీవితంలో అత్యంత కీలకమైన దశలో కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయించాలనుకున్నప్పుడు...  తనను నమ్ముకున్న,  తనతో ఉద్యమ సహచర్యం చేసిన అనేక మంది వ్యక్తులను ఇంటికి పిలిచి వారితో ప్రజాస్వామ్యం మీద, పార్టీ రాజకీయాలపైనా, తన కుమారుడి భవిష్యత్తు పై నాతో గంటల పాటు చర్చించి, చివరకు తన కుమారుడిని రాజకీయరంగ ప్రవేశం చేయించిన వ్యక్తి శ్రీ గద్దర్.   చివరిసారిగా కాంగ్రెస్ శాసనసభాపక్షనాయకుడు మల్లు భట్టివిక్రమార్కతో కలిసి సంగీత దర్శకుడు మణిశర్మ గారి ఆఫీసులో వారిని కలిశాను. అప్పుడు కూడా ఆయన సామాజిక, రాజకీయ అంశాలు ఎన్నో చర్చించారు.   వెన్నులో బుల్లెట్ తనను నిత్యం ఇబ్బందిపెడుతున్నా, హైదరాబాద్ నగరం దాటి రాలేని పరిస్థితుల్లో నా తమ్ముడి వివాహం కోసం ఒకరోజు ముందుగానే “మే నెల” ఎండల్లో హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చి రెండ్రోజులుపాటు మా ఆతిధ్యం స్వీకరించి,  మా ఇంట్లో శుభకార్యానికి హాజరైన వ్యక్తి ఈ రోజు లేకపోవడం నన్నెంతో వేదనకు గురిచేస్తోంది.   కానీ పుట్టిన వారికి మరణం తప్పదు… శ్రీ గద్దర్ గారు, ఏ లోకంలో ఉన్న వారి ఆత్మ శాంతించాలని … తిరిగి పీడిత, తాడిత జనుల కోసం, ఇదే గడ్డపై జన్మించాలని మనసారా కోరుకుంటా...    
-మీ ఆరా మస్తాన్, సెఫాలజిస్ట్‌

Advertisement
 
Advertisement
 
Advertisement