పోలీస్‌ నియామకాలపై అఫిడవిట్‌ ఇవ్వండి: హైకోర్టు | Provide affidavit on police appointments says High Court | Sakshi
Sakshi News home page

పోలీస్‌ నియామకాలపై అఫిడవిట్‌ ఇవ్వండి: హైకోర్టు

Jul 22 2026 3:59 AM | Updated on Jul 22 2026 12:00 PM

Provide affidavit on police appointments says High Court

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు శాఖలో ఇటీవల ప్రభుత్వం ఆమోదించిన సుమారు 7,400 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను నాలుగు వారాల్లో అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. రాష్ట్ర పోలీసు శాఖలో వివిధ హోదాల్లో భారీగా ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హెల్ప్‌ ది పీపుల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కీతినేడి అఖిల్‌ శ్రీగురు తేజ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 

ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. స్పెషల్‌ జీపీ రాహుల్‌ వాదనలు వినిపిస్తూ.. 5,000 పోలీసు పోస్టుల నియామక ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని దీనికి సంబంధించి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పత్రికా ప్రకటన కూడా విడుదల చేసిందని తెలిపారు.  

కానిస్టేబుల్‌ నియామకాలపై సెప్టెంబర్ 8న సుప్రీంలో తుది విచారణ 
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 2022 నాటి పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు సంబంధించి మిగిలిపోయిన సుమారు 400 పోస్టుల భర్తీ వివాదంపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 8న తుది విచారణ చేపట్టనుంది. ఒకే రిజర్వేషన్‌ కేటగిరీకి జిల్లాల వారీగా వేర్వేరు కటాఫ్‌ మార్కులు నిర్ణయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ అతుల్‌ ఎస్‌. చందూర్కర్‌ ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇదొక సంక్లిష్ట న్యాయపరమైన అంశమని వ్యాఖ్యానించింది. 

ముఖ్యంగా ఆర్టికల్‌ 371(డి) కింద రాష్ట్రపతి ఉత్తర్వులను వ్యాఖ్యానించాల్సిన అవసరం ఇందులో ఇమిడి ఉందని పేర్కొంది. పరిపాలనా సౌలభ్యం కోసం రెండు జిల్లాలను కలిపి ఒకే జిల్లాగా చేసినప్పుడు, లోకల్‌ ఏరియా పరిధిని ఎలా నిర్ధారించాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. అనంతరం ఈ వ్యవహారంపై తుది విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అలాగే, ఇదే కేసుకు సంబంధించి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసులో తదుపరి చర్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement