పోస్టుల్లేకపోయినా పదోన్నతులు!

Promotions On Board of Higher Education Are Becoming Controversial - Sakshi

ఉన్నత విద్యా మండలి తీరుపై విమర్శలు 

ఉన్న పోస్టులను అప్‌గ్రేడ్‌ చేశారనే ఆరోపణలు 

పాలకమండలి, ప్రభుత్వ ఆమోదం లేదనే వాదనలు 

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత విద్యా మండలిలో పదోన్నతులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు అవసరమైన పోస్టులు లేవని, వారు పని చేస్తున్న పోస్టులనే అప్‌గ్రేడ్‌ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉన్నత విద్యా మండలికి చెందిన పాలక మండలి ఆమోదం కానీ, అటు ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  

12 మందికి పదోన్నతులు 
మండలిలో జాయింట్‌ సెక్రటరీ పోస్టు లేకపోయినా ప్రస్తుతం పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీకి జాయింట్‌ సెక్రటరీ స్థాయిలో పదోన్నతి కల్పించి, ఆయనకు ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టు కట్టబెట్టారని, అది నిబంధనలకు విరుద్ధమనే వాదనలు విన్పిస్తున్నాయి. అలాగే మండలిలో ప్రస్తుతం ఒకటే అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టు ఉంది. దానికి తోడు మరొక పోస్టును అసిస్టెంట్‌ సెక్రటరీ పోస్టుగా అప్‌గ్రేడ్‌ చేసి ఆ పోస్టుల్లో ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు తెలిసింది. అలాగే సూపరింటెండెంట్‌ పోస్టు ఒకటే ఉన్నప్పటికీ, మరో నాలుగు పోస్టులను అప్‌గ్రేడ్‌ చేసి మొత్తంగా ఐదుగురికి పదోన్నతులు కల్పించారు.

అయితే అందులో ఇద్దరు ఆ పదోన్నతులను తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 12 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే 1994 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉన్నత విద్యా మండలి పోస్టుల భర్తీ విధానానికి సంబంధించిన జీవో 51 లో ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టు భర్తీ ప్రక్రియ ఉంది. ఆ పోస్టును డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఫైనాన్స్‌ ఆఫీసర్‌ పోస్టు మండలిలో లేదు. దీంతో ఆ పోస్టు జోలికి ఎవరూ వెళ్లలేదు.  

ఏ పోస్టునూ అప్‌గ్రేడ్‌ చేయలేదు: కార్యదర్శి 
ఈ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ప్రభుత్వం అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలని చెప్పిందన్నారు. అందులో భాగంగానే తాము ఏడేళ్లుగా పనిచేస్తున్న తమ సిబ్బందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏ పోస్టును కూడా ఆప్‌గ్రేడ్‌ చేయలేదని, వ్యక్తిగత పదోన్నతులు మాత్రమే ఇచ్చామని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top