రైతుల పొట్టగొట్టి.. జనాల జేబుకొట్టి

Profit For Vegetable Traders Losses For Farmers - Sakshi

కూరగాయల వ్యాపారులకు లాభాల ‘పంట’

అటు రైతుల్ని, ఇటు ప్రజలను దోచుకుంటున్న వైనం

ధరలు మండిపోతున్నా రైతుకు దక్కని ప్రయోజనం

ఇటు సామాన్య ప్రజల జేబులూ గుల్ల

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు రాజు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం గోవర్ధనగరి గ్రామం. ఎకరం పొలంలో టమాటా సాగు చేశాడు. మంగళవారం 18 బాక్సులు ఆటోలో వేసుకుని సిద్ది పేట కూరగాయల మార్కెట్‌కు వచ్చాడు. వ్యాపారులు 24 కిలోలు ఉండే ఒక్కో బాక్స్‌ను రూ.60 నుంచి రూ.70 మధ్య అడిగారు. రూ.60కి ఇస్తే కూలీ కూడా రాదని ఆవేదన చెందాడు. మూడు బాక్స్‌లను రూ.100 చొప్పున అమ్మగలిగాడు. మిగిలిన 15 బాక్స్‌లు తక్కువ ధరకు అమ్మేం దుకు మనసొప్పక తిరిగి తీసుకెళ్లిపోయాడు. ఇదే మార్కెట్‌లో వ్యాపారులు కిలో టమాటా రెండింతల ధరకు విక్రయిస్తూ లాభం పొందడం చూసి కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.

►ఈ ఏడాది కూరగాయల దిగుబడి బాగానే ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి మార్కెట్‌కు సుమారు 2లక్షల క్వింటాళ్లు అధి కంగా దిగుబడి వచ్చింది.
►మొదట్లో బాగానే ఉన్నా, రైతుల ఆశలపై లాక్‌డౌన్‌ నీళ్లు చల్లింది. కూలీల కొరత, రవాణా సమస్యగా మారితే, వ్యయ ప్రయాసలకోర్చి మార్కెట్‌కు తరలిస్తున్న రైతు లను హోల్‌సేల్‌ వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు.
►లాక్‌డౌన్‌ను సాకుగా చూపుతూ డిమాండ్‌ లేదని, ధర లేదని చెబుతూ రైతులకు నామమాత్రపు ధరనే చెల్లిస్తు న్నారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం తక్కువగా ఉండ టంతో రైతులూ అయినకాడికి అమ్ముకుంటున్నారు.
► రైతులకు కుచ్చుటోపీ పెడుతూ తక్కువ ధరకు కొంటున్న హోల్‌సేలర్లు.. మళ్లీ అదే లాక్‌డౌన్‌ కారణంగా కూరగాయలు రావడం లేదంటూ, రెండు మూడింతల అధిక ధరలకు ప్రజలకు విక్ర యాలు జరుపుతున్నారు. 
►ఇక రిటైల్‌ మార్కెట్‌లో స్థానిక వ్యాపారులు ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి అమ్ముతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
►కనీసం పెట్టుబడి కూడా దక్కని విధంగా తన పంటను అమ్ముకుంటున్న రైతు, బయటి మార్కెట్‌లో మండి పోతున్న రేట్లు, వ్యాపారులు లాభాలు ఆర్జిస్తున్న తీరు చూసి దిగులుపడుతున్నాడు.

అమ్మబోతే అలా.. కొనబోతే ఇలా..
ఇతని పేరు కానుగంటి రాజు మహబూబాబాద్‌ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన రైతు. ఇతను ఇరవై ఐదు గుంటల భూమిలో వంకాయ, సొరకాయ, ఇతర కూరగాయలు సాగు చేస్తున్నాడు. రూ.52 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. భార్యాభర్తలిద్దరూ కూరగాయల సాగులో పని చేస్తుంటారు. పంట దిగుబడి మంచిగా వస్తుందనుకున్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చి పడింది. రోజూ వంకాయలను తెంపుకొని కురవి, మరిపెడ మార్కెట్‌లకు వెళ్లి అమ్మబోతే కిలో పది రూపాయలకు అడుగుతున్నారు. సొరకాయ రూ.5కే అడుగుతున్నారు. చేసేదేమీ లేక ఆ రేటుకే వేసి వస్తున్నామని రాజు వాపోయాడు. అదే వ్యాపారి రిటైలర్లు, ప్రజలకు కిలో వంకాయలు రూ.40కి, సొరకాయ రూ.20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం. 

సాక్షి, హైదరాబాద్‌/ నెట్‌వర్క్‌: దిగుబడి ఎక్కువ అయితే ధరలు తగ్గుతాయన్న మార్కెట్‌ సూత్రం రాష్ట్రంలోని కూరగాయల వ్యాపారులకు వర్తించడం లేదు. రాష్ట్రంలో అటు హోల్‌సేల్‌ మార్కెట్లలో, ఇటు రిటైల్‌ వ్యాపారుల వద్ద కూరగాయల ధరలు మండి పోతున్నాయి. లాక్‌డౌన్‌ను సాకుగా చెబుతూ వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేసి విక్ర యిస్తున్నారు నేరుగా రైతు దగ్గరి నుంచి కొనుగోలు చేసి అమ్మే హోల్‌సేల్‌ మార్కెట్లలో ధరలు గత ఏడాదితో పోలిస్తే 35 శాతం పెరిగాయని ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ముఖ్యమైన కూరగాయల్లో 95% రకాల ధరలు పెరిగాయని, ఇందులో కొన్ని 30 శాతం పెరిగితే, మరికొన్ని 100 శాతం పెరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

దిగుబడి పెరిగినా..    
గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మే 23 వరకు మొత్తం అన్ని రకాల కూరగాయలు కలిపి 5,75,268 క్వింటాళ్లు హోల్‌సేల్‌ మార్కెట్ల ద్వారా బహిరంగ మార్కెట్‌లోకి వెళ్లాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌ 1నుంచి మే 23 వరకు 7,53,987 క్వింటాళ్లు వెళ్లాయని ప్రభుత్వ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇలా గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 2 లక్షల క్వింటాళ్ల కూరగాయలు ఎక్కువగా మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ ధరలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప తగ్గకపోవడం గమనార్హం. లాక్‌డౌన్‌ విధించినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరుకు రవాణాకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయినా వ్యాపారులు లాక్‌డౌన్‌ పేరిట అటు రైతుల్ని, ఇటు వినియోగదారుల్ని దోచుకుంటున్నారు.

హోల్‌సేల్‌కు, రిటైల్‌కు పొంతనే లేదు
మరోవైపు హోల్‌సేల్‌ మార్కెట్‌ ధరలకు, రిటైల్‌ మార్కెట్‌ ధరలకు పొంతనే లేకుండా పోతోంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఏడు రూపాయలు పలుకుతున్న టమాటా బహిరంగ మార్కెట్‌లో 15–20 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇలా అన్ని రకాల కూరగాయల ధరలు ప్రాంతాన్ని బట్టి, వ్యాపారిని బట్టి మారిపోతుండడం గమనార్హం. 

రేట్ల పట్టికలు పెట్టరా?    
హోల్‌సేల్‌ మార్కెట్లలో కానీ, రిటైల్‌ వ్యాపారాలపై కానీ ఎక్కడా ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటం లేదు. గత ఏడాది మాదిరి మొబైల్‌ వాహనాల ద్వారా విక్రయం వంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయలేదు. వాస్తవానికి లాక్‌డౌన్‌ కాలంలో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయన్న విషయం ప్రభుత్వ వర్గాలకు కూడా తెలిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలోనూ, కూరగాయల దుకాణాల వద్దా రేట్ల పట్టికలు పెట్టాలని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పోలీసులు కూడా పలుమార్లు ప్రకటనలు చేశారు. కానీ సరైన పర్యవేక్షణ కొరవడటంతో ఎక్కడో ఒక చోట తప్ప రేట్ల పట్టికలే కనిపించక పోవడం గమనార్హం.

అసలే కరోనా.. ఆపై ధరల దడ
ఓ పక్క కరోనాతో బతుకు భయం భయంగా మారింది. ఇళ్లలోనే ఉంటూ సరైన ఆహారమన్నా తీసుకుందామంటే పెరిగిన కూరగాయల ధరలతో దడ పుడుతోంది. లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు కూరగాయలు ధరలు అడ్డగోలుగా పెరిగాయి. ప్రభుత్వం సడలింపు ఇచ్చిన నాలుగు గంటల సమయంలో కొనుగోలు చేద్దామంటే మార్కెట్లలో రద్దీతో భయమేస్తోంది. ఇక కాలనీల్లో ఉండే చిన్నపాటి షాపుల్లో కొనుగోలు చేయాలంటే ధరలు విపరీతంగా ఉంటున్నాయి. ఇదేమిటని అడిగితే కరోనాతో పెద్ద మార్కెట్‌లోనే ధరలు పెరిగాయని చెబుతున్నారు. లాక్‌డౌన్‌ ముందు కిలో రూ.60 ఉన్న క్యారెట్, కాకరకాయ వంటివి ఇప్పుడు రూ.80కి చేరాయి. ఇక అన్ని కూరల్లో వాడే మిర్చి ధరలైతే చెప్పక్కర్లేదు. అప్పట్లో పావు కిలో రూ.10 ఉన్న మిర్చికి ఇప్పుడు రూ.20 పెట్టాల్సి వస్తోంది. 
జి.సుజాత,రామకృష్ణా కాలనీ, హన్మకొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top