
వైద్యం వికటించి బాధితురాలి మృతి
యువతి ప్రేమికుడు, ఆర్‌ఎంపీ అరెస్టు
హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసిన హోంగార్డు.. గర్భస్రావం కోసం ఆర్‌ఎంపీతో చికిత్స చేయించాడు. అది వికటించి బాధితురాలు మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో హోంగార్డుతో పాటు మహిళా ఆర్‌ఎంపీని పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్‌నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన బ్యాగరి మౌనిక (29) ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. ముచ్చింతల్ కు చెందిన బానూరి మధుసూదన్ పోలీస్ శాఖలో శంషాబాద్ ఫింగర్ ప్రింట్ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్నాడు.
మౌనికను ప్రేమిస్తున్నానంటూ ఏడేళ్ల నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. ఈ క్రమంలో మౌనిక గర్భం దాల్చగా.. నాలుగు రోజుల క్రితం విషయం అతనికి తెలిసింది. దీంతో గర్భం తొలగించడానికి మౌనికను పాల్మాకులలో ఉన్న ఆర్‌ఎంపీ పద్మజ వద్దకు తీసుకువచ్చి అబార్షన్ చేయించాడు. వైద్యం వికటించి మౌనికకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను నగరంలోని మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ మౌనిక ఈ నెల 13న మృతి చెందింది. మృతురాలి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపైలైంగిక దాడి, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. మంగళవారం నిందితులు మధుసూదన్, ఆర్‌ఎంపీ పద్మజను అరెస్టు చేశారు.