Telangana Congress: 3 నెలలు ఆగాల్సిందే!

Posts In Congress Party To Be Filled In Three Months - Sakshi

కాంగ్రెస్‌లో పదవుల పందేరానికి కసరత్తు

ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల ఎంపికలో రేవంత్‌ ఆచితూచి అడుగులు

మరో ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్ల ప్రతిపాదనపై సానుకూలంగా హైకమాండ్‌

కొత్త కార్యవర్గ నియామకం తర్వాత పాదయాత్ర

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల పందేరానికి మరో మూడు నెలలు సమయం పట్టనుందని తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కోశాధికారితోపాటు అధికార ప్రతినిధుల నియామకం కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భారీ కసరత్తు చేస్తున్నారు. అలాగే, ఈ పదవులతోపాటు మరో ఇద్దరు వర్కింగ్‌ ప్రెసిడెంట్లను కూడా నియమించాలన్న టీపీసీసీ ప్రతిపాదనకు హైకమాండ్‌ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ నేతలకు ఈ పదవులు ఇచ్చే అవకాశాలున్నాయి. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్త పాదయాత్రపై దృష్టి పెడతారని, ఈలోపు రాష్ట్రంలో నాలుగైదు చోట్ల ఇంద్రవెల్లి తరహా సభలు నిర్వహిస్తారని తెలుస్తోంది.

మరో ఇద్దరు కావాలి..
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించినప్పుడే ఐదుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్‌ ఉపాధ్యక్షులను కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఇందులో ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఒక రెడ్డి, ఒక ఎస్సీ నేతకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించారు. బీసీల నుంచి రెండు ప్రధాన సామాజిక వర్గాలైన యాదవ్, రెడ్డిలకు అవకాశమివ్వగా, ఎస్సీల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన గీతారెడ్డిని నియమించారు.

అయితే, బీసీల్లో మరో ప్రధాన సామాజికవర్గానికి అవకాశమివ్వాలని, ఎస్సీల నుంచి మాదిగలను నియమించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సామాజిక వర్గాలకు అవకాశమిచ్చేలా మరో ఇద్దరిని వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించాలని టీపీసీసీ పార్టీ హైకమాండ్‌కు ప్రతిపాదన పంపినట్టు తెలుస్తోంది. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఢిల్లీ నాయకత్వం బీసీల నుంచి కొండా సురేఖ (మున్నూరుకాపు), ఈరవత్రి అనిల్‌ (పద్మశాలీ), మాదిగ సామాజికవర్గం నుంచి ఎస్‌.సంపత్‌కుమార్‌ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.  

సమతూకం.. సహకారం
టీపీసీసీ కొత్త కార్యవర్గం కోసం సామాజిక సమతూకంతోపాటు తనకు పూర్తి సహకారాన్ని అందించగల నాయకులు ఎవరున్నారన్న దానిపై రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ నుంచి తగిన ప్రాతినిధ్యం ఇవ్వడంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పదవులు లభించే కోణంలోనూ ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే, గతంలో ఉన్న తరహాలో జంబో కార్యవర్గం కాకుండా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కలిపి 50 మంది దాటొద్దని, అధికార ప్రతి నిధుల సంఖ్య కూడా 20–25కు మించొద్దని ఆయన భావిస్తున్నారు. దీంతోపాటు కొన్ని జిల్లాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. ఈ తతంగమంతా పూర్తయ్యేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుందని తన సన్నిహితుల వద్ద రేవంత్‌ చెప్పినట్టు తెలుస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top