విద్యుత్‌ ఉద్యోగులపై పోలీసుల ప్రతాపం  

Police Lotty Charges On Electricity Employees In Nalgonda - Sakshi

నల్లగొండలో రెండు ఫీడర్ల పరిధిలో కరెంట్‌ సరఫరా నిలిపివేత 

పోలీసుల తీరుపై మంత్రి జగదీశ్‌ సీరియస్‌... బాధ్యులపై చర్యకు డీజీపీ, ఎస్పీకి ఆదేశం

సాక్షి ప్రతినిధి నల్లగొండ/హైదరాబాద్‌: ‘మేం విద్యుత్‌ ఉద్యోగులం, డ్యూటీకి వెళ్తున్నాం’అని చెప్పినా వినిపించుకోకుండా పోలీసులు వారిపై లాఠీలు ఝళిపించారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడారు. నల్లగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనలపై ఉద్యోగులు ఆందోళన చేశారు. అదే సమయంలో పట్టణంలోని రామగిరి ప్రాంతంలోని రెండు ఫీడర్ల బ్రేక్‌డౌన్‌ కావడంతోపాటు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వివరాలు.. నాంపల్లిలో పని చేసే విద్యుత్‌ శాఖ జూనియర్‌ అసిస్టెంట్‌ ప్రభు విధినిర్వహణలో భాగంగా శుక్రవారం రాత్రి నల్లగొండలోని డివిజన్‌ ఆఫీసుకు వెళ్లి వస్తుండగా రామగిరిలో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు.

శనివారం ఉదయం 10 గంటల తర్వాత ఈఆర్‌వో కార్యాలయానికి విధుల నిమిత్తం వెళ్తున్న అరుణను వెంకటేశ్వర కాలనీ వద్ద, జానకిని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద పోలీసులు అడ్డుకొని అనుచితంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన ఉద్యోగులు ఈ విషయాన్ని ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. అదేసమయంలో 11 గంటల ప్రాంతంలో రెండు ఫీడర్లు డౌన్‌ కావడంతో వాటికి మరమ్మతులు నిర్వహించేందుకు స్థానిక విద్యుత్‌ సిబ్బంది నిరాకరించారు. ఈ విషయాన్ని ఎస్‌ఈ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్‌ ఎస్పీతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అనంతరం విద్యుత్‌ సిబ్బంది మరమ్మతులు నిర్వహించి సరఫరాను పునరుద్ధరించారు. పోలీసుల దురుసు ప్రవర్తనను  ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
విద్యుత్‌ శాఖ సేవలకు అడ్డుపడొద్దు: మంత్రి 
ఈ ఘటనలపై విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. వెంటనే డీజీపీ మహేందర్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ఎస్పీతో కూడా ఫోనులో మాట్లాడారు. విద్యుత్‌శాఖ అత్యవసర సర్వీస్‌ కిందికి వస్తుందని, ఆ శాఖ సేవలకు ఆటంకం కలిగించొద్దని మంత్రి సూచించారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్న విద్యుత్‌ సిబ్బందిపై లాఠీచార్జ్‌ చేయడం సరి కాదని, పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో లాక్‌డౌన్‌ నిబంధనలు కూడా కఠినంగా పాటించాలన్నారు. మితిమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి సీరియస్‌ కావడంతో ఎస్పీ రంగనాథ్‌ స్పందించి విద్యుత్‌ ఉద్యోగులను ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.  

తీవ్రంగా ఖండిస్తున్నాం...
24 గంటలు పనిచేస్తున్న విద్యుత్‌ ఉద్యోగులను విచక్షణారహితంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని 1104 జిల్లా కార్యదర్శి నిమ్మచెట్ల వెంకటయ్య అన్నారు. తమను ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తించిందని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top