
కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలి
రాష్ట్రానికి భారంగా అధిక శాతం వడ్డీలు: సీఎం రేవంత్‌రెడ్డి
ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్రదేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... ‘రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది.హైదరాబాద్‌తోపాటు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాం.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవ ల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఉద్యోగులకు సముచిత అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్ నిర్మిస్తాం. రీజినల్ రింగ్ రోడ్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నాం’అని వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లే అంశంపై చర్చ జరిగింది. అధిక వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి చెల్లింపులు కష్టం అవుతోందని సీఎం తెలిపారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.