ఓయూ ప్రైవేట్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ కోర్సులు 

PhD Courses In OU Private Colleges - Sakshi

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సులకు అనుమతి ఇవ్వనున్నారు. ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, న్యాయశాస్త్రం, వ్యాయామ విద్య, ఎడ్యుకేషన్‌ తదితర కోర్సుల్లో పీహెచ్‌డీ ప్రవేశాలకు ఆయా కాలేజీల్లో రీసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇంత కాలం కేవలం ఓయూ కాలేజీలకే పరిమితమైన పీహెచ్‌డీ కోర్సు కొత్తగా ఏర్పాటు చేసిన రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుతో ఇక నుంచి ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా కొనసాగనుంది.  రీసెర్చ్‌ సెంటర్ల అనుమతికి ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఈనెల 10 వరకు అవకాశం కలి్పంచారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వలన క్యాంపస్, అనుబంధ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో పీహెచ్‌డీ సీటు ఒక్కటి కూడా లేదు.

దీంతో ఐదేళ్లుగా పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు నిలిచిపోయాయి. వర్సిటీ అభివృద్ధికి చేపట్టిన పలు సంస్కరణల్లో భాగంగా పరిశోధన విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన పరిశోధనల కోసం పీహెచ్‌డీ ప్రవేశాలకు రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. గత నెలలో జరిగిన పాలక మండలి సమావేశంలో రీసెర్చ్‌ సెంటర్ల ఏర్పాటుకు సభ్యుల ఆమోదం లభించినందున ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో కూడా పీహెచ్‌డీ కోర్సులకు అనుమతించాలని నిర్ణయించారు. ఓయూ పరిధిలో పలు పీజీ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో పరిశోధనలకు కావాల్సిన మౌలిక వసతులు, ప్రయోగశాలలు, గైడ్‌íÙప్‌ అర్హత గల ఇద్దరు అధ్యాపకులు ఉన్న కాలేజీలకు రీసెర్చ్‌ సెంటర్‌కు అనుమతి ఇవ్వనున్నారు.  

ఓయూ ద్వారానే పీహెచ్‌డీ ప్రవేశాలు, పరీక్షలు: రిజి్రస్టార్‌  
రీసెర్చ్‌ సెంటర్లకు అనుమతి లభించిన ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ ప్రవేశాలతో పాటు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు, వైవా (సెమినార్‌) ఓయూ చేపడుతుందని రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థి ఆయా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల అధ్యాపకుల పర్యవేక్షణలో పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీ ఫీజులు కూడా ప్రైవేట్, అటానమస్‌ కాలేజీలకు చెల్లించాలని సూచించారు. ప్రైవేట్, అటానమస్‌ కాలేజీల్లో పీహెచ్‌డీ చేసే విద్యార్థులకు ఓయూ క్యాంపస్‌లో హాస్టల్‌ వసతి ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టంచేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top