ముదురుతున్న ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలను దారికి తేవాలని ప్రభుత్వం భావిస్తుండగా, ఎలాగైనా బకాయిలు రాబట్టుకోవాలనే యోచనలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కూడా ప్రైవేట్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. కాలేజీల వద్ద సిబ్బంది ఆందోళనలు కొనసాగాయి. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో జరుగుతున్న ఫార్మసీ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రైవేట్ కాలేజీలు నిర్వహించలేదు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం (ఫతి) పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.
మరోవైపు ప్రభుత్వం నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటోంది. ఇంకో వైపు పరిస్థితిపై అధికార యంత్రాంగం చర్చోపచర్చలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫతి నేతలకు ఫోన్లు వెళ్లాయి. ‘ముందు కాలేజీలు తెరవండి..సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుందాం’అనే సందేశాలు ఫతి నేతలకు వచ్చాయి. దీపావళిలోగా ఇస్తామన్న రూ.900 కోట్లు ఇవ్వాలని, మిగిలిన బకాయిలు ఎప్పుడిస్తారో జీఓ ద్వారా తెలియజేయాలన్నది యాజమాన్యాల డిమాండ్.
ఉన్నతాధికారుల మంతనాలు
సీఎస్ రామకృష్ణారావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు యోగితారాణా, దేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. బంద్‌లో ఏఏ కాలేజీలు పాల్గొన్నాయో ఆరా తీశారు. ఫతిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలు సేకరించారు. అంతకు ముందు ఫతికి చెందిన ఇద్దరు నేతలతో డిప్యూటీ సీఎం ఫోన్ ద్వారా రహస్య మంతనాలు జరిపినట్టు తెలిసింది.
బంద్‌కు దూరంగా ఉండే కాలేజీల పట్ల భవిష్యత్‌లో సానుకూలంగా ఉంటామనే సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఈ విషయం తెలియగానే ఫతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..అధికారులు క్షేత్రస్థాయిలో కాలేజీల వ్యవహారాలపై దృష్టి పెట్టారు. ఏ కాలేజీలో ఎలాంటి అవకతవకలున్నాయనే నివేదిక రూపొందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది.
ముదురుతున్న ఆందోళన
ఈ నెల 8వ తేదీన దాదాపు 30 వేల మంది కాలేజీల సిబ్బందితో, 11వ తేదీన లక్షకుపైగా విద్యార్థులతో సభ నిర్వహిస్తామని ఫతి ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరుగుతాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పరిస్థితి హింసాత్మకంగా మారే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాలు అంటున్నాయి. ఫతిలో కొంతమంది ప్రభుత్వ అనుకూల ధోరణి ఉన్నా, ఎక్కువ మంది వ్యతిరేక ధోరణితో ఉన్నారు.
వీరికి కొన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉందనేది నిఘా వర్గాల సమాచారం. దీంతో భారీ సంఖ్యలో సిబ్బంది, విద్యార్థులను రాజధానికి తరలిస్తే అవాంఛనీయ ఘటనలు జరగొచ్చని, ఇది ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ప్రదర్శనలకు అనుమతి నిరాకరించినా, ఆందోళన మరోరూపం దాల్చే వీలుందనే అనుమానం పోలీసు వర్గాల నుంచి వస్తోంది. దీన్ని వాయిదా వేయించేందుకు ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఫతి మాత్రం తమ సత్తా చూపించుకోవడానికి ఇది వేదికగా భావిస్తోంది.
రీ ఎంబర్స్‌మెంట్‌పై కమిటీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ హేతుబద్ధీకరణ, ఉన్నతవిద్య బలోపేతానికి ప్రభుత్వం కమిటీ వేసింది. గత నెల 28వ తేదీనే ఇందుకు సంబంధించిన జీఓ వచ్చినా, మంగళవారం దీన్ని హడావిడిగా వెలుగులోకి తెచ్చింది. సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో ఆర్థిక, విద్య, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ శాఖల కార్యదర్శులతోపాటు, ఉన్నత విద్యా మండలి చైర్మన్, ఎస్సీ డెవలప్‌మెంట్ విభాగం కమిషనర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంను సభ్యులుగా చేర్చారు.
ఫతి నుంచి ఎన్.రమేశ్‌బాబు, కేఎస్.రవికుమార్, డాక్టర్ కే.రామదాస్‌కు సభ్యులుగా చోటు కల్పించారు. ట్రస్ట్ బ్యాంకు ద్వారా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిర్వహణ, హేతుబద్ధీకరణ, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం, ఉన్నతవిద్యలో నాణ్యత పెంపుపై ఈ కమిటీ చర్చించి మూడు నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించింది.


