Hyderabad: కాలుష్యం..కాస్త తగ్గింది 

PCB Report Says Slight Decrease Pollution Of Musi River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గతేడాది వరుస వర్షాలతో మూసీ కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజాగా విడుదల చేసిన 2022 వార్షిక నివేదిక స్పష్టం చేసింది. నది ప్రస్థానం పొడవునా 12 చోట్ల పీసీబీ శాస్త్రవేత్తలు నీటినమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరి కొండల్లో జని్మంచిన మూసీ.. నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణాలో కలుస్తోంది.

ప్రధానంగా అనంతగిరి నుంచి గ్రేటర్‌ సిటీకి సుమారు 100 కి.మీ వరకు మూసీ నదిలో కాలుష్యం అంతగా నమోదు కానట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ నగరంలోకి ప్రవేశించే బాపూఘాట్‌ నుంచి ప్రతాప సింగారం వరకు కాలుష్యం అధికంగా నమోదవడం గమనార్హం. గృహ, వాణిజ్య, పారిశ్రామిక, బల్‌్కడ్రగ్, ఫార్మా వ్యర్థ జలాలు మూసీలోకి చేరడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. నగర శివార్లు దాటిన అనంతరం కాలుష్య మోతాదు క్రమంగా తగ్గుముఖం పట్టడం విశేషం.  

పరిమితులు కొన్ని చోట్ల సంతృప్తికరం.. 
కరిగిన ఆక్సిజన్‌: నదిలో వృక్ష, జంతు ఫ్లవకాలు, ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు నీటిలో కరిగిన ఆక్సిజన్‌ మోతాదు 4 మిల్లీగ్రాముల కంటే అధికంగా ఉండాలి.  ఈ విషయంలో నగరంలోని బాపూఘాట్, మూసారాంబాగ్, నాగోల్, పీర్జాదిగూడ, ప్రతాప సింగారం ప్రాంతాల తోపాటు నగర శివార్లలోని పిల్లాయిపల్లిలో ఉండాల్సిన పరిమితి కంటే తక్కువగా ఉండడం గమనార్హం. మిగతా ప్రాంతాల్లో మూసీ నీటిలో కరిగిన ఆక్సిజన్‌ మోతాదు సంతృప్తికరంగా ఉండడం విశేషం. 

గాఢత: నది నీటిలో గాఢత 6.5 నుంచి 8.5 యూనిట్ల మధ్యలో ఉండాలని పీసీబీ పరిమితులు నిర్దేశిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో నదినీటిలో గాఢత పరిమితుల ప్రకారమే నమోదైంది. 
బీఓడీ: బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌గా పిలిచే ఈ మోతాదు ప్రతి లీటరు నీటిలో 30 మిల్లీగ్రాములకు మించరాదు. ఈ పరిమితులు అన్నిచోట్ల సంతృప్తికరంగానే ఉండడం విశేషం. 
కోలిఫాం బ్యాక్టీరియా: పీసీబీ పరిమితుల ప్రకారం ఈ బ్యాక్టీరియా మోతాదు 50 యూనిట్లకు మించరాదు. ఈ విషయంలో గండిపేట్, భీమారం బ్రిడ్జి, వాడపల్లి వద్ద మాత్రమే ఈ పరిమితుల ప్రకారం ఉండడం గమనార్హం. మిగతా చోట్ల ఈ మోతాదు శృతి మించింది. 
అమోనియా: ప్రతి లీటరు నీటిలో 1.2 మిల్లీగ్రాములు మించరాదు. పీసీబీ డేటా ప్రకారం అన్నిచోట్లా అమోనియా పరిమితుల ప్రకారమే నమోదవడం గమనార్హం.  

కొసమెరుపు..  
జాతీయ స్థాయిలో అత్యంత కాలుష్యకారక నదుల జాబితాలో చేరిన మూసీలో కాలుష్యం గతేడాది కుండపోతగా కురిసిన వర్షాలతో ఒకింత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిస్థాయిలో తగ్గలేదని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వర్షాకాలంలో కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టినా.. ఆ తర్వాత కాలుష్యం యథావిధిగా నమోదవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీసీబీ నివేదికపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈ విషయమై పీసీబీ ఉన్నతాధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. వారు స్పందించేందుకు నిరాకరించారు. 

మూసీ ప్రస్థానం పొడవునా పలు ప్రాంతాల్లో వార్షిక సరాసరి కాలుష్య మోతాదు ప్రతీ లీటరు నీటిలో మిల్లీ గ్రాముల్లో ఇలా ఉంది 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top