‘ఎలాగైనా మా కొడుకును గాడిలో పెట్టండి.. మీరేం చేస్తారో చేయండి’

సాక్షి, నల్గొండ: ముగ్గురు ఆడపిల్లల మధ్య ఒక్కగానొక్క కుమారుడు.. ఎంతో గారాబంగా పెరిగిన ఆ కొడుకు జులాయిగా మారి దొంగతనాలకు అలవాటుపడి.. చివరికి అమ్మానాన్నలపైనే తిరగబడే పరిస్థితి రావడంతో కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులను ఆశ్రయించాల్సిన దుస్థితి.. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూరు గ్రామంలోని దినసరి కూలీకి చెందిన కుటుంబం నల్లగొండ పట్టణంలోని బోయవాడలో బస్టాండ్ సమీపంలో నివాసం ఉంటోంది. నలుగురు సంతానంలో ఇద్దరు కుమార్తెలకు వివాహం కాగా మరో కుమార్తె డిగ్రీ చదువుతోంది.. కానీ ఒక్కగానొక్క కుమారుడు మాత్రం పదోతరగతి తర్వాత చదవనని మొండికేశాడు.
మద్యానికి బానిసయి ఆటో డ్రైవర్‌గా పనిచేయడం, సెల్‌ఫోన్లు చోరీ చేయడం, పక్క నివాసాల్లో చోరీలకు పాల్పడటంతో.. విషయం తెలిసిన తల్లిదండ్రులు పరువుపోయిందని తల్లడిల్లి చివరికి చేసేది లేక పోలీసులనే ఆశ్రయించారు. ఎలాగైనా మా కుమారున్ని గాడిలో పెట్టండి. నాలుగు తగిలిస్తారో.. మీ స్టేషన్లోనే ఉంచుతారో.. మీ ఇష్టం. తల్లిదండ్రులు అనే గౌరవం లేకుండా దూషిస్తున్నాడు. దొంగతనం ఎందుకు చేశావని నిలదీశాం. తప్పు పనులు చేయవద్దని కొడితే తిరిగి మాపై చేయి చేసుకుంటున్నాడు’’ అని పోలీసు స్టేషన్‌లో కన్నీరుమున్నీరయ్యారు.
‘మీరేం చేస్తారో... చేయండి. మా కుమారుడిని గాడిలో పెట్టేంతవరకు జైల్‌లో ఉంచండి’ అని ఆ బాలుని తల్లిదండ్రులు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి వద్ద ప్రాధేయపడ్డారు. ఎస్సై కౌన్సెలింగ్ అనంతరం కూడా. ఆ బాలున్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు తొలుత అంగీకరించలేదు. దీంతో బాలుడిలో మార్పు వచ్చే వరకు కౌన్సిలింగ్ ఇస్తామని, ప్రతిరోజూ ఉదయం స్టేషన్‌కు తీసుకురావాలని బాలుడి తల్లిదండ్రులకు చెప్పి పంపించినట్టు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.