న్యాప్‌లోకి 10 లక్షల ఆస్తులు!

Non Agricultural Property Enrollment Process in Telangana - Sakshi

ఇప్పటివరకు నమోదు చేసిన పంచాయతీలు

60 లక్షల కట్టడాలుంటాయని అంచనా.. ఈ–పంచాయతీలో నమోదు

వారం, పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ పూర్తి  

సాక్షి, హైదరాబాద్‌: ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్‌ పుస్తకాలు (మెరూన్‌ రంగు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా.. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కారు.. ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో.. వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది.

60 లక్షల కట్టడాలు..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్‌ శాఖ అంచనా వేసింది. ఈ ఆస్తుల వివరాలన్నింటినీ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆస్తుల నమోదుకు ముందు.. రివిజన్‌ రిజిష్టర్‌లో 53.23 లక్షల కట్టడాలున్నట్లు లెక్క తేలగా.. కొత్త కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఈ మేరకు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్‌ చేయడంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ న్యాప్‌ (నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌)లో నమోదు చేస్తున్నారు. అయితే, వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఫోన్‌ సిగ్నల్స్‌ లేకపోవడం.. ఇంటర్నెట్‌ సమస్య.. సర్వర్‌ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం కార్యదర్శులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజానీకం వ్యవసాయ పనులకు వెళ్లిపోతుండటంతో సమాచార సేకరణపై ప్రభావం చూపుతోంది.

కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్‌ నంబర్‌ తప్పనిసరి చేయడం కూడా తలనొప్పిగా తయారైంది. దీంతో సమాచారాన్ని యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంలో జాప్యం జరుగుతోంది. రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం నాటికి 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వారం పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలుత ఆస్తుల నమోదులో కొంత ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించామని, నమోదు ప్రక్రియ గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top