
నాటి అనుమానాస్పద భూ లావాదేవీలపై దర్యాప్తు
ఈ వారంలో కేరళ ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం!
పైలట్‌గా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో ఆడిటింగ్
అందుకు రెండు నెలలు పడుతుందంటున్న అధికారులు
ఆ తర్వాత ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల నిర్వహణ కోసం తెచ్చిన ‘ధరణి’పోర్టల్ ద్వారా జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం త్వరలోనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించా లని నిర్ణయించింది. ఆడిట్ నిర్వహణ కోసం కేరళకు చెందిన కేరళ సెక్యూరిటీ అండ్ ఆడిట్ ఎష్యూరెన్స్ సెంటర్ (కేఎస్‌ఏఏసీ) అనే ప్రభుత్వ రంగ సంస్థతో ఈ వారంలో ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. తొలుత ఆడిటింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్ణయించారు.
అందులో భాగంగా రా జన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించనున్నారు. ఫోరెన్సిక్ ఆడిటింగ్ విధివిధానాలు ఇప్పటికే రూపొందించినట్లు అధికార వర్గాల సమాచారం. వాటి ఆధారంగా భూలావాదేవీలను పరిశీలించేందుకు వీలు గా అవసరమైన డిజిటల్, మాన్యువల్ రెవె న్యూ రికార్డులను ఆ సంస్థకు అప్పగించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. భూ రికార్డు ల వ్యవహారం కావటంతో ప్రైవేటు సంస్థలకు కాకుండా ప్రభుత్వ రంగ సంస్థకు ఆడి టింగ్ బాధ్యతలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ రెండు జిల్లా ల్లో అన్ని రికార్డులు పరిశీలించేందుకు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫ లితాలను బట్టి ఫోరెన్సిక్ ఆడిటింగ్‌ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కేరళ సంస్థతో ఒప్పందానికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ వద్ద ఉందని, ఆయన ఆమోదం తెలిపిన వెంటనే ఒప్పందం కుదుర్చుకుని రంగంలోకి దిగుతామని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
పకడ్బందీగా ముందుకు...!
ధరణి పోర్టల్‌లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాదే నిర్ణయించింది. అయితే, రెవెన్యూ శాఖలో సంస్కరణలు, ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావటం వంటి కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో కొంత జాప్యం జరిగింది. ఆలస్యంగానైనా ఆడిటింగ్‌ను పకడ్బందీగా నిర్వహిస్తామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
భూ లావాదేవీల డిజిటల్ ఫుట్ ప్రింట్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని అంటున్నాయి. భూరికార్డుల మార్పిడి, మ్యుటేషన్లు, యాజమాన్య హక్కుల బదిలీ, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో జరిగిన అనుమానాస్పద లావాదేవీలతోపాటు అవి ఏ సమయంలో జరిగాయి? ఎక్కడి నుంచి జరిగాయి? ఏ అధికారి లాగిన్ ద్వారా జరిగాయనే వివరాలను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, ఫోరెన్సిక్ ఆడిట్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు జిల్లాలను ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకోనుంది.