
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జాతీయ రహదారులు 2024 నాటికి అమెరికా స్థాయి ప్రమాణాలతో అందుబాటులోకి వస్తాయని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 2014 నుంచి 2024 నాటికి పదేళ్ల కాలంలో రాష్ట్రంలో రూ.3 లక్షల కోట్ల కేంద్ర నిధులతో జాతీయ రహదారుల విస్తరణ జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర పురోగతిలో కీలకంగా మారనున్న రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)కు సంబంధించి ఇప్పటికే అనుమతించిన ఉత్తర భాగం శంకుస్థాపన కోసం మరో మూడు నెలల్లో తాను తిరిగి హైదరాబాద్‌కు వస్తానన్నారు. త్వరలోనే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికీ అనుమతి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా విస్తరించబోయే 17 జాతీయ రహదారుల పనులకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే విస్తరణ పనులు పూర్తి చేసుకున్న రెండు జాతీయ రహదారులను ఆయన జాతికి అంకితం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఎరీనాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు.
తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రం
కొత్తగా నిర్మించబోయే రీజినల్ రింగురోడ్డు పొడవునా శాటిలైట్ టౌన్‌షిప్స్, ప్లాన్‌సిటీ, ఇండస్ట్రియల్ క్లస్టర్లు, లాజిస్టిక్ పార్కులు నిర్మించాలని గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల హైదరాబాద్‌కు మంచినీటి సమస్య లేకుండా పోయిందన్నారు. తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రమని అభినందించారు. ఎల్‌బీనగర్–మల్కాపూర్ 12 వరసల జాతీయ రహదారి నిర్మాణం హైదరాబాద్‌కు పెద్ద ఊరటనివ్వనుందన్నారు. హైదరాబాద్– విజయవాడ హైవే విస్తరణలో ఉన్న అడ్డంకులు అధిగమించి పనులు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. డైనమిక్ మంత్రిగా ముద్రపడ్డ నితిన్ గడ్కరీ చొరవ వల్లనే తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా సాగుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ తెలంగాణకు గేమ్ ఛేంజర్‌గా మారనుందన్నారు.
మరిన్ని ప్రాజెక్టులివ్వాలి: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జాతీయ రహదారుల విస్తరణ వేగంగా సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులు మంజూరు చేసిన గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 29 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు 3,663 కి.మీ.కు గాను 2,525 కి.మీ.మేర మాత్రమే నోటిఫై చేశారని, మిగతావి కూడా నోటిఫై చేయాలని కోరారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి వీకే సింగ్, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పి.రాములు, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యేలు రఘనందన్‌రావు, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కార్యకర్తల నినాదాలు
మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేరు ఎత్తగానే బీజేపీ కార్యకర్తలు బీజేపీ జిందాబాద్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. కిషన్‌రెడ్డి వారికి సర్దిచెప్పారు. కాగా తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రణాళిక ప్రకారమే బీజేపీ నేతలు వ్యవహరించారని ప్రశాంత్‌రెడ్డి సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అధికారిక కార్యక్రమమని చెప్పి బీజేపీ బహిరంగ సభలా మార్చారని విమర్శించారు.
ఇది ట్రైలరే.. త్వరలో పూర్తి సినిమా
తెలంగాణ ఏర్పడ్డ సమయంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి 2,511 కి.మీ. మాత్రమే. ప్రస్తుతం 5 వేల కి.మీ.కు చేరువైంది. ఇది ట్రైలరే. పూర్తి సినిమా త్వరలో ఉంటుంది. రాష్ట్రంలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానించాం. మిగిలిన పెద్దపల్లి జిల్లాను కూడా త్వరలో జోడిస్తాం. దేశంలో 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు నిర్మిస్తుండగా, వీటిల్లో ఐదు తెలంగాణ మీదుగానే సాగుతున్నాయి.