స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు

New Zonal System Will Ensure Justice To Locals: KTR - Sakshi

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జోనల్‌ విధానం 

విద్య, ఉద్యోగాల్లో అన్ని జిల్లాల వారికి సమాన వాటా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త జోనల్‌ వ్యవస్థ ద్వారా అన్ని జిల్లాలకు చెందిన విద్యార్థులు, యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టితో జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించి కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారని వెల్లడించారు. కొత్త జోనల్‌ విధానానికి కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. కొత్త విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశం ఉంటుందని స్పష్టంచేశారు.

తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారి ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త జోనల్‌ వ్యవస్థ రూపుదిద్దుకున్నదని, పునర్‌వ్యవస్థీకరణ ద్వారా రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లా స్థాయి పోస్టులు.. జూనియర్‌ అసిస్టెంట్‌ మొదలుకుని జోన్లు, మల్టీజోన్ల ఉద్యోగాల వరకు స్థానిక ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చడాన్ని చట్టబద్ధం చేయడంతో పాటు వికారాబాద్‌ జిల్లాను ప్రజల కోరిక మేరకు చార్మినార్‌ జోన్‌ పరిధిలో చేర్చడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకే పరిమితం కాకుండా టీఎస్‌ఐపాస్‌ విధానం ద్వారా రాష్ట్రంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ సంఖ్యలో పరిశ్రమలను తీసుకువచ్చామన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top