కొత్త సచివాలయంలో.. సరికొత్త ఫౌంటెయిన్‌లు!

New Secretariat Building Red Stone Fountain Front Of Parliament - Sakshi

పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్‌ తరహాలోనే...  

అక్కడ ఒక్కటే.. ఇక్కడ రెండు.. 

సెక్రటేరియట్‌లో సిద్ధమైన ‘ఢిల్లీ’డిజైన్‌ ఫౌంటెయిన్లు 

ధోల్పూర్‌ ఎర్రరాతితో నిర్మాణం 

ఫౌంటెయిన్‌ నుంచి నీళ్లు ధారలు.. వాటిపై లైట్ల కాంతులు..  

నూతన సచివాలయానికి అందాల సొబగులు 

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలోని పార్లమెంటు ముందు ధోల్పూర్‌ ఎర్రరాతితో నిర్మించిన ఫౌంటెయిన్‌ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. పార్లమెంటు సభ్యులు సహా సందర్శకులు దాని ముందు నిలబడి ఫొటోలు దిగుతుంటారు.. ఇప్పుడు అచ్చుగుద్దినట్టు అలాంటి ఫౌంటెయినే తెలంగాణ కొత్త సచివాలయంలో సిద్ధమైంది. పార్లమెంటు ముందు ఒకటే ఫౌంటెయిన్‌ ఉండగా, సచివాలయంలో రెండు రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు ఇవి ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. 

–ఇండోపర్షియన్‌ ఆకృతిలో గుమ్మటాలతో రూపుదిద్దుకుంటున్న సచివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉండాలన్న ఉద్దేశంతో పార్లమెంటు ముందున్న ఆకృతిలో ఫౌంటెయిన్‌లను డిజైన్‌ చేశారు. సచివాలయ భవనం ముందు రెండు వైపులా విశాలమైన లాన్లు ఉంటాయి. వాటి మధ్యలో రెండు వైపులా రెండు ఫౌంటెయిన్‌లు నిర్మించాలని భావించి రకరకాల ఆకృతులు పరిశీలించారు. కానీ, చివరకు పార్లమెంటు ముందున్న ఆకృతిని ఎంపిక చేశారు. 

►దిగువ 47 అడుగుల వెడల్పుతో భారీ వేదిక.. దానిమీద 25 అడుగుల వెడల్పుతో సాసర్‌ ఆకృతిలో నీటి తొట్టె, దాని మీద 9 అడుగుల వెడల్పుతో మరో తొట్టె.. ఈ మూడింటిని అనుసంధానిస్తూ దాదాపు 27 అడుగుల ఎత్తున్న శిల.. అంతా ఎరుపు రంగు.. ఇది దీని ఆకృతి. 

►అప్పట్లో బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ దీన్ని డిజైన్‌ చేయగా పార్లమెంటు భవనం ముందు నిర్మించారు. ఇప్పుడు అదే డిజైన్‌ను వినియోగించి ఇక్కడ నెలకొల్పారు. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్‌కు మొత్తం రాజస్థాన్‌లోని ధోల్పూర్‌ ఎర్రరాతి ఫలకాలను వాడారు. ఆ నిర్మాణానికి ప్రత్యేకంగా రంగు ఉండదు. ఇక్కడ కూడా అదే రాతిని వినియోగించటం విశేషం. 

►సచివాలయం బేస్‌కు పూర్తిగా ఈ ఎర్రరాయినే వాడారు. ఇందుకోసం రాజస్థాన్‌ ధోల్పూర్‌ క్వారీలకు వెళ్లి అక్కడ రాయిని ఎంపిక చేసి తెప్పించిన విషయం తెలిసిందే. పార్లమెంటు ముందున్న ఫౌంటెయిన్‌ తరహాలోనే పాటా్నలో ఇటీవల ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కలిసి చర్చించి సలహాలు తీసుకున్నారు. ఇప్పుడు అదే డిజైన్‌తో రెండు ఫౌంటెయిన్ల నిర్మాణం పూర్తయింది. దీంతో సచివాలయ ప్రధాన నిర్మాణం పనులు పూర్తయినట్టయింది. ఈ ఫౌంటెయిన్‌ నుంచి నీళ్లు ధారలుగా ఎగజిమ్మి దిగువకు పడుతుండగా, వాటిపై లైట్ల కాంతులు ప్రసరిస్తూ అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top