
9 నుంచి రాష్ట్ర కోటా కౌన్సెలింగ్ ప్రారంభం
సుప్రీంకోర్టులో కేసు కారణంగా షెడ్యూల్‌లో మార్పు
స్టేట్ స్ట్రే వేకెన్సీ కౌన్సెలింగ్
అక్టోబర్ 2 నుంచి 5 వరకు
అక్టోబర్ 10తో ముగియనున్ననీట్ యూజీ ప్రవేశాలు
తాజా షెడ్యూల్ విడుదల చేసిన కాళోజీ యూనివర్సిటీ
సాక్షి, హైదరాబాద్: నీట్‌యూజీ–2025లో భాగంగా మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. గత నెల 12వ తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జూలై 21 నుంచి ప్రారంభమైతే, స్టేట్ కోటా కౌన్సెలింగ్ అదే నెల 30 నుంచి ప్రారంభం కావలసి ఉంది.
అయితే, స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండటంతో స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. మంగళవారం స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసి, తీర్పు రిజర్వు చేసిన నేపథ్యంలో వర్సిటీ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. అదే సమయంలో ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ వర్సిటీ ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీల్లో కొన్ని మార్పులు జరిగినట్లు తెలిపింది.
9 నుంచి స్టేట్ కోటా కౌన్సెలింగ్
ఆల్ ఇండియా కోటాలో జూలై 21 నుంచి 30 వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, దానిని ఆగస్టు 9 వరకు పొడిగించారు. స్టేట్ కోటా తొలి విడత కౌన్సెలింగ్‌ను ఆగస్టు 9 నుంచి 18 వరకు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. మూడు విడతల తర్వాత ఆల్ ఇండియా కోటా కింద స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ సెప్టెంబర్ 30 నుంచి 4 అక్టోబర్ వరకు జరగనుంది.
రాష్ట్ర కోటాలో స్ట్రే వేకెన్సీ కోటా కౌన్సెలింగ్ అక్టోబర్ 2 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. అక్టోబర్ 10వ తేదీతో ఆల్ ఇండియా కోటాతోపాటు స్టేట్ కోటా ప్రవేశాల ప్రక్రియ ముగుస్తుందని యూనివర్సిటీ ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పు 9వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే వర్సిటీ కొత్త షెడ్యూల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా, బీఎస్సీ, బీడీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానుంది.
కొత్త షెడ్యూల్ ప్రకారం నీట్ కౌన్సెలింగ్ వివరాలు
ఆల్ ఇండియా/డీమ్డ్/కేంద్ర విశ్వవిద్యాలయాలుమొదటి రౌండ్ కౌన్సెలింగ్: జూలై 21 నుంచి ఆగస్టు 9 వరకు
ఎంసీసీ ద్వారా అభ్యర్థుల డేటా ధ్రువీకరణ: ఆగస్టు 19 నుంచి 20 వరకు
చేరికకు చివరి తేదీ: ఆగస్టు 18
రెండో రౌండ్ కౌన్సెలింగ్: ఆగస్టు 21 నుంచి 29 వరకు
చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 5
మూడో రౌండ్: సెప్టెంబర్ 9–17
చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 25
స్ట్రే వేకెన్సీ రౌండ్: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 4 వరకు
చేరికకు చివరి తేదీ: అక్టోబర్ 10
స్టేట్ కోటా కౌన్సెలింగ్ వివరాలు
మొదటి రౌండ్: ఆగస్టు 9 నుంచి 18 వరకు
డేటా ధ్రువీకరణ: ఆగస్టు 25 నుంచి 26 వరకు
చేరికకు చివరి తేదీ: ఆగస్టు 24
రెండో రౌండ్: ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు
డేటా ధ్రువీకరణ: సెప్టెంబర్ 12 నుంచి 13 వరకు
చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 11
మూడో రౌండ్: సెప్టెంబర్ 15 నుంచి 25 వరకు
డేటా ధ్రువీకరణ: అక్టోబర్ 1
చేరికకు చివరి తేదీ: సెప్టెంబర్ 30
స్ట్రే వేకెన్సీ రౌండ్: అక్టోబర్ 2 నుంచి 5 వరకు
చేరికకు చివరి తేదీ: అక్టోబర్ 10