కొత్త రెవెన్యూ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు

New Revenue Act Is Not Against Anyone CM KCR Says - Sakshi

వీఆర్వోలు ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు

తక్షణమే అన్ని స్థాయిల్లో పదోన్నతులు 

తహసీల్దార్లకు కారు అలవెన్సు.. కార్యాలయాల్లో సదుపాయాలకు రూ.60 కోట్లు

రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలి

‘ట్రెసా’ ప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ 

కొత్త చట్టానికి మద్దతు     తెలిపిన ట్రెసా   

సాక్షి, హైదరాబాద్‌: వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇతర శాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. అలాగే వీఆర్‌ఏలలో అత్యధికంగా పేదవర్గాల వారే ఉన్నారని, వీరిలో వయోభారం ఉన్నవారి పిల్లలకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. వీఆర్‌ఏలకు స్కేల్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రెవెన్యూ యంత్రాంగానికి విధి నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.  శనివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ, ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను నిర్వహిస్తూ రెవెన్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. రెవెన్యూ శాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు అలవెన్సు రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రజల సౌలభ్యం కోసమే కొత్త చట్టం
ప్రజలు కేంద్ర బిందువుగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని, ఈ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రెవెన్యూశాఖలోని అధికారులు, సిబ్బంది సమష్టిగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ఇక నుంచి రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆకాంక్షించారు. వివిధ పనులపై రెవెన్యూ కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా,  హుందాగా వ్యవహరించి, వారి సమస్యలను ఓపికగా పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శ సోమేశ్‌ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. సమావేశానికి 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు. 

నూతన రెవెన్యూ చట్టానికి మద్దతు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ట్రెసా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌ కుమార్‌  తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను  రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్‌ ఆపరేటర్లను రెగ్యులరైజ్‌ చేయాలని, రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్‌ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top