దొంగ’ ముద్ర చెరుపుకోండి.. | KCR Portrayed Revenue Employees As Thieves: CM Revanth | Sakshi
Sakshi News home page

దొంగ’ ముద్ర చెరుపుకోండి..

Sep 6 2025 12:39 AM | Updated on Sep 6 2025 12:39 AM

KCR Portrayed Revenue Employees As Thieves: CM Revanth

కొత్తగా నియమితులైన జీపీవోకు నియామకపత్రం అందజేస్తున్న సీఎం రేవంత్‌. చిత్రంలో ప్రసాద్‌కుమార్, సీతక్క, పొంగులేటి, మహేందర్‌రెడ్డి, మల్‌రెడ్డి

గత ప్రభుత్వ పాలకుల భూదోపిడీ విధానాన్ని ప్రజలకు వివరించండి: సీఎం రేవంత్‌రెడ్డి

వీఆర్వోలు, వీఆర్‌ఏలులేని లోటు 20 నెలల పాలనలో కనిపించింది

ధరణితో పట్టిన దరిద్రాన్ని భూభారతితో వదిలించే ప్రయత్నం చేస్తున్నాం 

ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం.. సమయస్ఫూర్తి, సంయమనంతో మెలగండి

గ్రామ పాలనాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం... నియామక పత్రాలు అందజేత 

ప్రభుత్వానికి మచ్చ రాకుండా పనిచేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి సూచన 

సాక్షి, హైదరాబాద్‌: ‘రెవెన్యూ శాఖ సిబ్బందిని దొంగలుగా గత ప్రభుత్వం ముద్ర వేసింది. రాష్ట్రాన్ని దోచుకున్న వారిలో రెవెన్యూ సిబ్బంది ఉన్నారని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం. జాగ్రత్తగా ఉండండి. సమయస్ఫూర్తి, సంయమనంతో వ్యవహరించండి. మీపై వేసిన ముద్రను తొలగించుకోవడమే కాకుండా నాటి పాలకులు దోపిడీకి పాల్పడిన విధానాన్ని ప్రజలకు వివరించే విధంగా ప్రతిజ్ఞ చేయండి’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

పరిపాలన చేయలేనంటూ తనపై చేస్తున్న ఆరోపణలు, పాలనలో దోపిడీకి పాల్పడ్డారని రెవెన్యూ సిబ్బందిపై వేసిన ముద్ర తప్పని నిరూపించాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా కొత్తగా నియమితులైన గ్రామ పాలనాధికారుల (జీపీవో)కు శుక్రవారం హైదరాబాద్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.  

భూములు చెరబట్టేందుకే నాడు ధరణి భూతం.. 
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో భూమికి, ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధం తల్లీబిడ్డ బంధం లాంటిదన్నారు. నాటి పాలకులు ధన, భూదాహంతో తెలంగాణ భూభాగాన్ని చెరబట్టాలనే ఆలోచనతో ధరణి అనే భూతాన్ని తెచ్చారని రేవంత్‌ దుయ్యబట్టారు. ఆ భూతం ద్వారా కొల్లగొట్టే భూముల లెక్కలు ప్రజలకు తెలియకూడదనే దురాలోచనతోనే వీఆర్వో, వీఆర్‌ఏలను బలి ఇచ్చి ఆ వ్యవస్థలను తొలగించారని ఆరోపించారు. ప్రజల ముందు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా నిలబెట్టి నిస్సహాయులను చేశారని విమర్శించారు.

దోపిడీదారులంటూ పచ్చపోట్టు లాంటి ముద్ర వీఆర్వోలు, వీఆర్‌ఏలపై వేసిన నాటి పాలకులు కాళేశ్వరం కూలిపోయిందని ఆ పార్టీని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. వీఆర్వోలు, వీఆర్‌ఏల తరహాలోనే ఆ పార్టీ నేతలను ఉద్యోగాల నుంచి తొలగిస్తారా? అని నిలదీశారు. రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయిన విషయాన్ని తాను కాదని.. గ్రామాల్లోకి ఇప్పుడు వెళ్తున్న గ్రామ పాలనాధికారులే ప్రజలకు చెబుతారన్నారు. 

నాటి పాలకులు కొల్లగొట్టిన భూముల లెక్కలు తీయండి 
గతంలో వీఆర్వో వ్యవస్థ రద్దు కారణంగా పేదలకు న్యాయం జరగలేదని.. వీఆర్వోలు, వీఆర్‌ఏలు లేని లోటు తమ 20 నెలల పాలనలో కనిపించిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు గ్రామ పాలనాధికారుల రూపంలో రెవెన్యూ సిబ్బంది పేదలకు సేవ చేస్తారని.. రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు.

నాడు ధరణితో పట్టిన దరిద్రాన్ని భూభారతి చట్టంతో వదిలించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ‘నాటి పాలకులు అంటించిన వైరస్‌ ధరణి. ఆ వైరస్‌తో కొల్లగొట్టిన భూముల లెక్కలు తొందర్లోనే గ్రామ పాలనాధికారులు బయటకు తీయాలి. ఈ వ్యవస్థను పనిచేయించే బాధ్యత మంత్రి పొంగులేటిదే. మీపై, మంత్రిపై నాకు నమ్మకం ఉంది’అని సీఎం రేవంత్‌ అన్నారు. 

భూసమస్యలన్నింటినీ పరిష్కరించండి 
భూభారతి చట్టం ఫలాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతోనే గ్రామ పాలనాధికారుల నియామకం చేపట్టామని.. సాధారణ భూసమస్యలతోపాటు సాదాబైనామాల సమస్యలనూ పరిష్కరించాలని కోరారు. నిజాం, రజాకార్లు, భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లకు పట్టిన గతే ధరణి ముసుగులో భూదోపిడీకి పాల్పడాలనుకునే వారికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో గుణపాఠం రూపంలో పట్టిందని రేవంత్‌ పేర్కొన్నారు. అందుకే ప్రజాపాలన వచ్చిందని.. ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ కొలువుల జాతర మొదలైందన్నారు.

‘ఉద్యోగం ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తుంది. ఏదో పని దొరకుతుంది. కానీ మీపై పడిన మచ్చను చెరిపేసుకొనే అవకాశం అరుదుగా వస్తుంది. రెవెన్యూ శాఖపై పడిన మరకను చెరిపేసే బాధ్యత మీ 5 వేల మందిపై ఉంది. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. భుజం తట్టి ప్రోత్సహిస్తుంది. మీరిచ్చిన సూచనలను తీసుకుంటుంది’అని సీఎం రేవంత్‌ అన్నారు. కాగా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించినందుకు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు వి.లచ్చిరెడ్డి, కె. రామకృష్ణ, రమేశ్‌పాక, బాణాల రాంరెడ్డి, వంగ రవీందర్‌రెడ్డి, కె. గౌతమ్‌కుమార్, గోల్కొండ సతీశ్‌ తదితరులు సీఎం రేవంత్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఉగాది నాటికి 7 వేల మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు... 
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తగా నియమితులైన జీపీవోలు ప్రభుత్వానికి చిన్న మచ్చ కూడా రాకుండా పనిచేయాలని కోరారు. గత సర్కారు ధరణి చట్టానికి మూడేళ్లయినా నియమ, నిబంధనలు రూపొందించలేదని.. భూభారతి చట్టానికి మాత్రం 90–92 రోజుల్లోనే పకడ్బందీగా నియమ, నిబంధనలు రూపొందించి ప్రజలకు అంకితమిచ్చామని ఆయన చెప్పారు. అందరికీ రోల్‌మోడల్‌గా ఉండేలా చట్టం చేసేందుకు సీఎంను చాలాసార్లు విసిగించామని.. ఆయన కూడా 36 గంటలు నిద్రపోలేదని గుర్తుచేసుకున్నారు.

గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి పెండింగ్‌లో పెట్టిన సాదాబైనామాల దరఖాస్తులు పరిష్కరిస్తున్నామని.. నాడు రద్దయిన క్షేత్రస్థాయి రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఉగాది నాటికి 7 వేల మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. ప్రతి డిసెంబర్‌ 31న జమాబందీ నిర్వహిస్తామని.. భూభారతి చట్టం చుట్టంలాగా రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా కొత్త జీపీవోలతో మంత్రి పొంగులేటి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌ అలీ, హర్కర వేణుగోపాల్, మండలి చీఫ్‌ విప్‌ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేశ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement