సిద్దిపేటలో ‘త్రీ టౌన్‌’  | New police station Will Be Set Up In Siddipet Soon | Sakshi
Sakshi News home page

సిద్దిపేటలో ‘త్రీ టౌన్‌’ 

Apr 8 2021 3:36 PM | Updated on Apr 8 2021 4:53 PM

New‌ police station Will Be Set Up In Siddipet Soon - Sakshi

సిద్దిపేటకమాన్‌: జిల్లా కేంద్రం సిద్దిపేటలో వన్‌ టౌన్, టూటౌన్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌తో పాటు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటకు ఈ స్టేషన్‌ను మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, సిద్దిపేట పరిధిలో పెరిగిన జనాభా దృష్ట్యా సిద్దిపేటకు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరైనట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గత డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ సిద్దిపేట పర్యటన సందర్భంగా సిద్దిపేట జనభా పెరగడం, కరీంనగర్‌ వైపు వెళ్లే రాజీవ్‌ రహదారిలో సుమారు 90 కిలోమీటర్ల మేర ఒక్క పోలీస్‌ స్టేషన్‌ లేదని, సిద్దిపేటకు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు చేయాలని మంత్రి హరీశ్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు.

దీంతో త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల సీఎం కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌ ధన్యావాదాలు తెలిపారు. సుడా పరిధి దుద్దెడ వరకు ఉండటం, నూతన సమీకృత కలెక్టరేట్, పోలీస్‌ కమిషనరేట్, ఐటీ టవర్, ఇండస్ట్రియల్‌ హబ్, రైల్వే స్టేషన్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో పట్టణ గ్రామాలు ఉండటం, దుద్దెడ గ్రామానికి చెందిన వారు కుకునూర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం, ఏసీపీని కలవడానికి గజ్వేల్‌కు వెళ్లడానికి ఇబ్బందులు పడేవారని, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుతో ఆ బాధలన్నీ తప్పనున్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.   

పీఎస్‌లోకి వచ్చే గ్రామాలు 
త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి ప్రస్తుతం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొనసాగుతున్న గ్రామాలు రంగదాంపల్లి, మిట్టపల్లి, ఎల్లుపల్లి, బక్రిచెప్యాల, నాంచారుపల్లి ఎన్సాన్‌పల్లి, పొన్నాల, కిష్టసాగర్, తడ్కపల్లి, బొగ్గులోనిబండ, రాజగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెల్కటూర్‌ గ్రామం, కుకునూర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దుద్దెడ, దర్గా బందారం, అంకిరెడ్డిపల్లి, దోమలపల్లి, తొగుట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కమ్మంపల్లి, రాంపల్లి, సిరిసినగండ్ల, మర్పడగ గ్రామాలు, సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల, సురభి మెడికల్‌ కళాశాల ట్రీ టౌన్‌ పీస్‌ పరిధిలోకి రానున్నాయి.   

తాత్కాలిక భవనంలో ప్రారంభం 
నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ను పొన్నాల, బక్రిచెప్యాల మధ్యలో రాజీవ్‌ రహదారిపై తాత్కాలిక భవనంలో మరో రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. అదేవిధంగా పక్కా భవనం నిర్మించేలా రాజీవ్‌ రహదారిని ఆనుకొని ఉండేవిధంగా స్థల సేకరణ చేపట్టాలని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని మంత్రి ఆదేశించారు.  

57 మంది సిబ్బంది 
నూతనంగా ఏర్పడనున్న త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు ఏఎస్‌ఐలు, ఆ రుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, 43 మంది కానిస్టేబుళ్ల తో పాటు మొత్తం 57 మంది సిబ్బందితో ప్రజలు సేవలు అందించనున్నారు. దీంతో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామాలు, తొగుట, కుకునూర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని గ్రామాల ప్రజలకు సే వలు మరింత దగ్గరగా అందుబాటులోకి రానున్నాయి.  

ప్రజలకు మరింత రక్షణ సిద్దిపేటకు త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ మంజూరు కావడం సంతోషంగా ఉంది. ఇప్పటికే వన్‌టౌన్, టూటౌన్, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లు ఉన్నాయి. కొత్తగా త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుతో ప్రజలకు మరింత రక్షణ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందనున్నాయి.  – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement