నయా లుక్‌లో డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయ్‌!

New Look For Driving Licence And RCs Nationalwide - Sakshi

డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీలకు కొత్త రూపు 

దేశ వ్యాప్తంగా ఒకే తరహా విధానం 

వాహన్‌ సారథిలో వివరాల నమోదు 

సీఎంవీ యాక్ట్‌ మేరకు కొత్త పద్ధతి  

సాక్షి, సిటీబ్యూరో: నయా డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు వచ్చేశాయి. ఇప్పటివరకు తెలుపు రంగు కార్డుపై నలుపు, ఎరుపు రంగులో ముద్రించిన అక్షరాలతో కనిపించిన స్మార్ట్‌ కార్డులు ప్రస్తుతం లేత ఆకుపచ్చ, నీలి రంగుల్లో నలుపు అక్షరాలతో అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని అమలు చేసేందుకు  డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీల్లో మార్పులు చేశారు. కేంద్ర మోటా రు వాహన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్మార్ట్‌కార్డులను  అందజేసేందుకు చర్యలు చేపట్టినట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పాత స్మార్ట్‌కార్డులపై ముద్రించిన అక్షరాల కంటే కొత్త కార్డులపై ముద్రించిన అక్షరాల సైజును పెంచారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే నమూనాలో ఉండేవిధంగా వీటిని 
రూపొందించారు.  

దేశంలో ఎక్కడి నుంచైనా.. 
♦ కేంద్ర మోటారు వాహన చట్టం నిబంధనల మేరకు దేశవ్యాప్తంగా ఏకీకృత పౌరసేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు వాహన్‌ సారథి పోర్టల్‌లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన వాహనదారులు, డ్రైవర్ల వివరాలు నమోదవుతాయి. ఇటీవల వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాహన్‌ సారథి పోర్టల్‌తో అనుసంధానమై  ఉండేవి. వాహన సారథి పోర్టల్‌లో లేని రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాలు లేకపోవడంతో కేంద్ర మోటారు వాహన చట్టం (సీఎంవీ) అమల్లో సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తాయి.  

♦ వివిధ రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలు, వాహనదారులను ఈ చట్టం పరిధిలో గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు దూరంగా ఉన్న తెలంగాణ తాజాగా వాహన్‌ సారథిలో చేరడంతో తెలంగాణకు చెందిన వాహనాలు, డ్రైవర్ల వివరాలు దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చు. ఇందుకనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు చేసినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.  
కార్డుల కొరత తీరింది.. 

♦ మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 3.5 లక్షల డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌కార్డుల కొరత తీరినట్లు అధికారులు తెలిపారు. కొత్త సాంకేతిక వ్యవస్థతో పాటే కార్డుల ప్రింటింగ్, పంపిణీకి తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్డులు లేకపోవడంతో 3 నెలలుగా ప్రింటింగ్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే.  

♦ లక్షలాది మంది వాహనదారులు స్మార్ట్‌కార్డుల కోసం ఆర్టీఏ  కేంద్రాల చుట్టూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొత్త కార్డులు రావడంతో  ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న వాటిని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. మరో వారం, పది రోజుల్లో ఏ రోజు డిమాండ్‌ మేరకు ఆ రోజే కార్డులను ముద్రించి అందజేసే అవకాశం ఉంటుందని  అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top