
వినోద ప్రపంచంలో సరికొత్త శకం
ఓటీటీలతో నట్టింట్లోకి సినిమా
కంటెంట్, భాష ఏదైనా క్షణాల్లో కళ్ల ముందుకు..
పల్లె, పట్నం తేడా లేకుండా ఆధునిక వినోదం
కరకగూడెం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): ఒకప్పుడు వారాంతంలో కొత్త సినిమా విడుదలైతే థియేటర్లలోనే చూడాలన్న తపన. అందుకోసం క్యూ కట్టి టికెట్ సాధించడం ఓ అనుభవం! అయితే, కుటుంబాలతో సహా థియేటర్లకు వెళ్లడంలో ఇక్కట్లు, టికెట్లు, ఇతర ఖర్చుల భారం వెరసి గతమంతా జ్ఞాపకంగా మిగిలిపోయే పరిస్థితి ఎదురవుతోంది. ఇదే సమయాన థియేటర్లకు వెళ్లకుండానే అదే వినోదం మొబైల్, ట్యాబ్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీల్లోకి చేరింది. ఈ మార్పుకు కారణం ఓటీటీ ప్లాట్‌ఫాంలు. ఇన్నాళ్లు ప్రధాన నగరాలు, ఓ మోస్తరు పట్టణాలకే పరిమితమైన ఆండ్రాయిడ్ టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పల్లెలకు సైతం చేరడంతో.. వారికీ ఓటీటీలు అందుబాటులోకి వచ్చినట్లయింది.
వినోద విప్లవానికి నాంది
ఓటీటీ అనేది కేబుల్, డీటీహెచ్ వంటి వ్యవస్థలను దాటుకుని ఇంటర్నెట్ ద్వారా కంటెంట్ అందించే వేదిక. దీనినే ’వీడియో ఆన్ డిమాండ్’అని కూడా అంటారు. దీంతో సినిమా చూసేందుకు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా.. ఏ పని చేస్తున్నా.. సినిమా చూస్తూ మధ్యలో ఆపేసి మళ్లీ కుదిరినప్పుడే చూడొచ్చు. ప్రపంచంలోని అన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలు, డాక్యుమెంటరీలు, క్రీడలు, వార్తలు ఇలా అన్నీ ఒకరి సినిమా టికెట్ ధరతో కుటుంబమంతా చూసే అవకాశం దక్కడం అందరినీ ఆకట్టుకుంటోంది.
ఆకర్షణగా ఒరిజినల్ కంటెంట్
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో సినిమా, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలు సొంతంగా వెబ్ సిరీస్‌లు, సినిమాలు రూపొందిస్తున్నాయి. కొత్త టాలెంట్, వినూత్న ఆలోచనలకు ఇవి వేదికగా నిలుస్తున్నాయి. అభిరుచి కలిగిన నిర్మాతలు, దర్శకులు తమ సృజనాత్మకతను చాటడానికి అవకాశం ఏర్పడుతోంది.
హద్దుల్లేని వినోదం
ఓటీటీల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అన్ని ప్రపంచ భాషల్లోనూ కంటెంట్ అందుబాటులో ఉంది. డబ్బింగ్, సబ్ టైటిళ్లతో ఫ్రెంచ్, స్పానిష్ సినిమాలు కూడా ఇంట్లోనే చూడగలుగుతున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనే కాక నిర్వహణ భారంతో థియేటర్లు మూతపడగా కొత్త సినిమాలన్నీ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఈ ధోరణి కొనసాగుతూ ప్రేక్షకులకు వినోదం మరింత చేరువవుతోంది.
కొన్ని పరిమితులు, సవాళ్లు కూడా..
ఓటీటీ వినోదానికి కొన్ని పరిమితులున్నాయనే చెప్పాలి. అధిక డేటా వినియోగం, ఇంటర్నెట్ నాణ్యత సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ప్రతీ ప్లాట్‌ఫాంకి సబ్‌్రస్కిప్షన్ తీసుకోవడం కొంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అయినా ఇలాంటి సమస్యలు ఓటీటీల వినోద ప్రవాహాన్ని అడ్డుకోవడం లేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే కొత్త ఆలోచనలు, ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలకు అవకాశాలు చూపుతున్నాయి.
ఓటీటీలు ఒక వరం
అన్నిసార్లు థియేటర్లకు వెళ్లలేం. కానీ ఓటీటీలో నచ్చిన సినిమా కుదిరిన సమయంలో చూడొచ్చు. ఏ భాష అయినా తెలుగు వెర్షన్‌లో చూడగలుతున్నాం. ఒకసారి సబ్‌స్రైబ్ చేసుకుంటే ఎన్నో సినిమాలు చూసే అవకాశం ఉంది. – ఈసం దీపిక, పద్మాపురం
కుటుంబమంతా ఆస్వాదించే అవకాశం
ఓటీటీ వచ్చాక ఇంట్లోనే కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తున్నాం. నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం, ఓటీటీలు, యూట్యూబ్‌లో అన్నీ ఉంటున్నాయి. కుటుంబమంతా కలిసి గడిపే సమయం పెరిగింది. ఇది సంతోషాన్ని ఇస్తోంది. – కొత్తకొండ మురళి, కరకగూడెం
ఔత్సాహికులకు అవకాశాల గని..
మారుమూల గ్రామానికి చెందిన నాకు సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనేది కల. ఓటీటీ వేదికగా ఆ అవకాశం దక్కింది. ఇటీవల ’మోతెవరి లవ్ స్టోరీ’వెబ్ సిరీస్‌లో నటించా. ఓటీటీలు, ఇంటర్నెట్ ద్వారా నాలాంటి ఎందరికో అవకాశాలు లభిస్తున్నాయి. – తొలెం శ్రీనివాస్, నటుడు, పినపాక