
విప్లవానికి ద్రోహం చేసిన శత్రువు ముందు మోకరిల్లారు
లొంగుబాట్లతో జరిగే నష్టం ఎంతటిదైనా అది తాత్కాలికమే
తాజా పరిణామాలపై మావోయిస్టు పార్టీ లేఖ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్టీ విచ్ఛిన్నకులుగా..విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన సోను, సతీశ్, వారి అనుచరులకు తగిన శిక్ష విధించాలని ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పిలుపునిచి్చంది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతిని«ధి అభయ్ పేరిట ఈనెల 16న రాసిన లేఖ ఆదివారం వెలుగుచూసింది. లేఖలోని ప్రధానాంశాలివి...
సోను రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి
2011 నుంచి దండకారణ్యంలో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైంది. అప్పటి నుంచే సోనులో రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయి. 2020 డిసెంబర్‌లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలో కొన్ని లోపాలపై సోను ప్రవేశపెట్టిన పత్రాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించింది. ఆ తర్వాత జరిగిన కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సమావేశాల్లో సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి పార్టీ కృషి చేసింది.
ఆయనలో పొడసూపుతున్న వ్యక్తివాదం, అహంభావం, పెత్తందారీతనాన్ని సరిద్దుకోవాలని కోరింది. అయితే 2025 మేలో మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయి.
నిజాలు దాచి .. నిందలు మోపుతూ..
ఆపరేషన్ కగార్‌తో ప్రతీరోజు ప్రాణాలు ఎదురొడ్డి విప్లవవోద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఎదురైంది. అయితే సోనులో పెరుగుతూ వచ్చిన సుఖలాలస, స్వార్థాలు త్యాగానికి సిద్ధపడని స్థితికి, ప్రాణభీతికి దారి తీశాయి. తన బలహీనత, ప్రాణభీతికి ముసుగు కప్పి, పార్టీ అనుసరిస్తున్న తప్పుడు రాజకీయ సైనిక పంథా (వ్యూహం) ఫలితంగానే భారత విప్లవోద్యమం ఓటమి పాలయ్యే స్థితికి దారితీసిందని, ఈ స్థితిలో ఆయుధాలను శత్రువుకు అప్పగించి, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ చేయడం మినహా మరో మార్గం లేదనే మితవాద అవకాశవాద, రివిజనిస్టు వైఖరితో కూడిన లొంగుబాటు ప్రకటన సెప్టెంబరు 15న సోను నుంచి వచ్చింది. తన అభిప్రాయాలపై నమ్మకముంటే సోను వాటిని పార్టీ ముందు పెట్టి చర్చించాల్సింది. కానీ శత్రువు ముందు లొంగిపోయాడు.
బహిష్కరిస్తున్నాం
సోను, అతని అనుచరులు ఆయుధాలు పార్టీకి అప్పగించి లొంగిపోవాలని కేంద్ర కమిటీ సూచించినా, దాన్ని పాటించకుండా ఆయుధాల్ని శత్రువుకు అప్పగించారు. ఇదివిప్లవ ప్రతిఘాతుకత (కౌంటర్ రివల్యూషన్) అవుతుంది. విప్లవ ద్రోహిగా మారిన సోను, అతనితోపాటు లొంగిపోయిన డీకే ఎస్‌జెడ్‌సీ సభ్యుడు వివేక్, దీపలతో పాటు మరో పదిమందిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. ఈ విప్లవ ద్రోహులకు తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నాం.
గతేడాది నుంచి వారు కాంటాక్ట్‌లో ఉన్నారు..
గతేడాది చివర్లో తన జీవిత సహచరితోపాటు మరికొందరిని మహాæరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో సోను, ఆశన్న కాంటాక్ట్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోవర్టుగా మారినట్టు ఈ మధ్య జరిగిన ఘటనల ద్వారా అర్థమవుతోంది. కోవర్టులుగా మారిన సోను, సతీశ్‌లకు నూతన పద్ధతుల్లో భారత విప్లవోద్యమాన్ని నిర్మిస్తాననే నైతిక అర్హత లేదు. ఇకనైనా పార్టీని చీల్చే పనులు మానుకోవాలని సోను, సతీశ్‌లను హెచ్చరిస్తున్నాం.
భవిష్యత్ కార్యాచరణ
భారీ లొంగుబాట్లు విప్లవోద్యమానికి నష్టమే అయినా ఇవి తాత్కాలిక నష్టాలే. వీటి ప్రభావం దీర్ఘకాలం ఉండొచ్చు. కానీ విప్లవోద్యమం శాశ్వత ఓటమికి గురికాదు. పీడన, సామాజిక అంతరాలు ఉన్నంత వరకు వర్గ పోరాటం ఉంటుంది. మారిన సామాజిక పరిస్థితులు, మారుతున్న విప్లవ స్వాభావిక లక్షణాలకు తగినట్టుగా మన రాజకీయ – సైనిక పంథాను సుసంపన్నం చేసుకొని భారత విప్లవోద్యమాన్ని కొనసాగిద్దామని యావత్ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం.