మొదట్లో మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్న జవాన్లు
ఆపై క్యాంప్‌ల వ్యూహంతో భద్రతా బలగాలకు అడవిపై పట్టు
ఈ క్రమంలోనే అనివార్యంగా లొంగుబాట్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పెరిగిన నిర్బంధం..సహకరించని ఆరోగ్యం కారణంగా ప్రజాస్వామ్యయుత పోరాటానికే పరిమితం అవుతున్నట్టు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు సందర్భంగా చెప్పారు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అందుకే అన్నలు అనివార్యంగా అడవిని వీడుతున్నారు.
పారా మిలిటరీని ఎదుర్కొనేలా..
బస్తర్ అడవుల్లోకి పారా మిలిటరీ దళాలు అడుగుపెట్టగానే మావోయిస్టులు రక్షణ వ్యూహాలకు పదును పెట్టారు. జర్మన్ యుద్ధరీతులను అధ్యయనం చేసి వేగంగా బంకర్లు, బూబీట్రాప్స్ నిర్మాణాలను వంట పట్టించుకున్నారు. తమ బస(క్యాంప్)కు సంబంధించిన సమాచారం పోలీసులు, భద్రతా దళాలకు చేరిన తర్వాత వారు తమను చుట్టుముట్టేందుకు ఎంత సమయం పడుతుంది ? ఈ దాడి నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఎంత సమయం అవసరం ? తప్పించుకున్న తర్వాత చెల్లాచెదురైన దళాలు 24 లేదా 72 గంటల్లోగా తిరిగి ఎక్కడ కలుసుకోవాలి ? అనే అంశాలపై అధ్యయనం చేశారు.
చివరకు భద్రతాదళాలు కనీసం నాలుగు కిలోమీటర్ల పాటు అడవిలో నడిస్తే తప్ప తమను చేరుకోలేనంత దట్టమైన అడవిలోనే క్యాంప్‌లు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నాలుగు కిలోమీటర్ల నడకలో ఉన్నప్పుడే భద్రతా దళాలపై అంబూష్ లు చేసే టెక్నిక్ నేర్చుకున్నారు. దీంతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో భాగంగా అడవుల్లోకి వెళ్లిన బలగాలు అనేక సార్లు మావోయిస్టుల ఉచ్చులో చిక్కుకున్నాయి.
కట్టుదిట్టం చేసినా..
ఆపరేషన్ గ్రీన్‌హంట్ చేపట్టి పదేళ్లు దాటినా సానుకూల ఫలితం రాకపోవడంతో 2017లో ఆపరేషన్ సమాధాన్ (ఎస్–స్మార్ట్ లీడర్‌షిప్, ఏ–అగ్రెసివ్ స్ట్రాటజీ, ఎం– మోటివేషన్ అండ్ ట్రైనింగ్, ఏ–యాక్షనబుల్ ఇంటెలిజెన్స్, డీ–డ్యాష్ బోర్డ్ బేస్డ్ కీ రిజల్ట్ ఏరియా, హెచ్– హార్నెస్టింగ్ టెక్నాలజీ, ఏ–యాక్షన్ ప్లాన్, ఎన్–నో ఆక్సెస్ టు ఫైనాన్సింగ్ )ను కేంద్రం తెరపైకి తెచ్చిది.
మావోయిస్టుల ఆర్థిక వనరులపై దెబ్బకొట్టడం, వారి స్థావరాలను కచ్చితంగా కనుక్కోవడం, ఔషధాలు అందకుండా చూడడం, మావోయిస్టుల్లోకి కొత్త రిక్రూట్‌మెంట్లు తగ్గించే పనిపై ఫోకస్ చేశారు. ఆఖరకు వాయుమార్గ దాడులకు తెర తీశారు. ఎన్ని చేసినా 2021 ఏప్రిల్‌లో తెర్రం దగ్గర జరిగిన దాడిలో 22 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడం భద్రతాదళాలకు పెద్ద ఎదురుదెబ్బగా నిలిచింది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు మరో కొత్త వ్యూహం భద్రతాదళాలకు అవసరమైంది.
4 కి.మీ ప్లాన్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ 4 కిలోమీటర్లకు ఒక పారామిలిటరీ క్యాంప్ ఏర్పాటు చేసే వ్యూహానికి శ్రీకారం చుట్టారు. దీని ప్రకారం అడవిలో క్యాంప్ ఏర్పాటు చేసి 24 గంటలూ జవాన్లు అక్కడే ఉన్నారు. క్యాంప్ చుట్టూ నాలుగు కి.మీ. పరిధిలో నిత్యం కూంబింగ్ చేశారు. క్యాంపుతోపాటే భారీ వాహనాలు తిరిగేలా తాత్కాలిక రోడ్లు, మొబైల్ టవర్లు, విద్యుత్ సౌకర్యం కల్పించారు.
నెల రోజుల వ్యవధిలోనే ఆ ప్రాంతంపై పట్టు సాధించి అక్కడి నుంచి 4 కి.మీ. దూరంలో మావోలకు పట్టున్న ప్రాంతంలో మరో కొత్త క్యాంప్ (ఫార్వర్డ్ ఆపరేటింగ్ బ్లాక్, ఎఫ్‌ఓబీ) ఏర్పాటు చేశారు. ఇలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగడంతో 2023 నాటికి 300 పైగా క్యాంపులు ఏర్పాటయ్యాయి. పరిస్థితులు తమకు అనుకూలంగా మారాయనే నమ్మకం రాగానే 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. మావోయిస్టుల కదలికలపై మానవ, సాంకేతిక నిఘాతో కచ్చితమైన దాడులు జరిగాయి.
ప్రతీ ఎన్‌కౌంటర్ మావోయిస్టులకు భారీ నష్టం చేస్తూ వచ్చింది. చివరకు ఆ పార్టీ సుప్రీం కమాండర్ నంబాల సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఓ వర్గం సాయుధ పోరాటానికి సెలవు ప్రకటించి ఆయుధాలతో లొంగిపోగా, మరికొందరు సాయుధ పోరాటానికి మద్దతు ఇస్తూనే పెరిగిన నిర్బంధం, అనారోగ్య సమస్యల కారణంగా వనం వీడాల్సి వస్తోంది.


