మలిపోరుకు రెఢీ
సామగ్రితో కేంద్రాలకు చేరిన సిబ్బంది
138 జీపీలు.. 1,123 వార్డులకు పోలింగ్
చుంచుపల్లి: జిల్లాలోని ఏడు మండలాల్లో ఆదివారం జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విడతలో 16 పంచాయతీలు, 248 వార్డులు ఏకగ్రీవం కాగా, 138 గ్రామ పంచాయతీలు, 1,123 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సిబ్బంది శనివారం ఎన్నికల సామగ్రితో వారికి కేటాయించిన స్థానాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి సాయంత్రానికి ఫలితాలు వెల్ల డిస్తారు. ముందుగా వార్డు సభ్యులు, తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. గెలిచిన వార్డు సభ్యుల్లో సగం మంది అందుబాటులో ఉంటే వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహిస్తారు. లేదంటే మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, ములకలపల్లి, పాల్వంచ మండలాల పరిధిలోని జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు 90 బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేశారు. 4,019 మంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. వీరిలో ఆర్‌ఓలు 187 మంది, పీఓలు 1,671, ఓపీఓలు 2,031 మంది ఉన్నారు. వీరితో పాటు రూట్ ఆఫీసర్లు 61 మంది. జోనల్ ఆఫీసర్లను 27 మందితో పాటు ఎఫ్‌ఎస్‌టీ టీమ్ 23, ఎస్‌ఎస్‌టీ టీమ్‌కు 19 మందిని కేటాయించారు. ఇక రెండో విడత పోలింగ్ కోసం 4.50 లక్షల బ్యాలెట్ పత్రాలు, 1,420 బ్యాలెట్ బాక్సులు, 1,392 పోలింగ్ కేంద్రాలను సిద్ధంగా ఉంచారు.
బరిలో 3, 206 మంది..
జిల్లాలో రెండో విడతలో 156 గ్రామ పంచాయతీలు, 1,392 వార్డులకు గాను 16 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. పాల్వంచ మండలం పాండురంగాపురంలో ఎస్టీ రిజర్వ్‌డ్ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయకపోగా, ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. మిగిలిన 138 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక 1,384 వార్డులకు 13 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాకపోగా 248 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 1,123 వార్డులకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికలు జరిగే 138 పంచాయతీల్లో 386 మంది సర్పంచ్ అభ్యర్థులు, 1,123 వార్డులకు 2,820 మంది కాగా, మొత్తంగా 3,206 మంది బరిలో ఉన్నారు.
నేడు రెండో విడత
పంచాయతీ ఎన్నికలు
మలిపోరుకు రెఢీ
మలిపోరుకు రెఢీ
మలిపోరుకు రెఢీ


