ఏర్పాట్లు పూర్తి చేశాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ఆదివారం జరుగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని, సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ తదితర మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సమయానికి చేరుకుని విధులు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. పోలింగ్ సిబ్బంది, సెక్టార్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, రిటర్నింగ్ అధికారులకు ముందుగానే శిక్షణ ఇచ్చామని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసి సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అక్రమ నగదు, మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కీలక పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని, ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఓటర్లు భయాందోళనకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
పంపిణీ కేంద్రంలో పరిశీలన..
చుంచుపల్లి: ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం క్లబ్‌లోని సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆర్‌ఓలను ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా సాగేందుకు ప్రతీ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్


