నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట భద్రత
ఇల్లెందు: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పట్టిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్‌రాజ్ తెలిపారు. శనివారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. చర్ల, దుమ్ముగూడెంలోనూ ఇదే తరహాలో అధికారులను సన్నద్ధం చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎన్డీ, ఇతర ఎంఎల్ గ్రూపులు పోటీ చేస్తున్నాయని, అందుకే ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అతి సమస్యాత్మక గ్రామాలైన దామరతోగు, మామకన్ను, దనియాలపాడు, సుభాష్‌నగర్‌లో ఏకగ్రీవం కావడం శుభపరిణామం అన్నారు. జిల్లాలో 1,400 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ..
గ్రామపంచాయతీ ఎన్నికల తర్వాత రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఉంటుందని ఎస్పీ వెల్లడించారు. రోడ్డు భద్రత చర్యలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. భద్రాచలం మీదుగా జిల్లాలోకి వచ్చే గంజాయిని పూర్తిగా నియంత్రిస్తామని తెలిపారు. నంబర్ లేని బైక్‌లు, వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాత్రికేయుల వాహనాలకు ప్రత్యేకంగా స్టిక్కర్లు సమకూర్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు వెంటనే పరిహారం అందజేశామని, ప్రస్తుతం జిల్లా నుంచి అజ్ఞాతంలో ఎవరూ లేరని చెప్పారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ ఎన్.చంద్రభాను, సీఐలు టి.సురేష్, బత్తుల సత్యనారాయణ, ఎల్.రవీందర్, ఎస్‌ఐలు హసీనా, సమ్మిరెడ్డి, రాజేందర్, శ్రీనివాసరెడ్డి, నాగుల్ మీరా, సైదా రవూఫ్ పాల్గొన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి..
కొత్తగూడెంటౌన్: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని ఎస్పీ రోహిత్‌రాజ్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బంది, అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభపెట్టేలా ఎవరైనా నగదు, మద్యం పంపిణీ చేస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఎస్పీ రోహిత్‌రాజ్ వెల్లడి


