రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన శ్రీరామాంజనేయరెడ్డి – శారద దంపతులు రూ.1,00,116 చెక్కును ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపికను అందజేశారు.
రామయ్యను దర్శించుకున్న ఆండవన్‌స్వామి..
శ్రీ సీతారామచంద్రస్వామి వారిని శ్రీరంగంలోని శ్రీ పౌండరీపుర స్వామి ఆశ్రమానికి చెందిన ఆండవన్ స్వామి శనివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన


