
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఆరు కొత్త తెలుగు, తమిళ ఒరిజినల్ సినిమాలు, వెబ్ సిరీస్‌లను సోమవారం ప్రకటించింది. వాటిలో భాగంగా ఆనంద్ దేవరకొండ హీరోగా దర్శకుడు వినోద్ అనంతోజు తెరకెక్కించనున్న తెలుగు చిత్రం ‘తక్షకుడు’. ఈ సినిమాలో ఆనంద్ అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సందీప్ కిషన్ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో ఓ తెలుగు వెబ్ సిరీస్ రూ పొందనుంది.
అలాగే ప్రియాంక మోహన్, పార్క్ హై–జిన్ ప్రధాన పాత్రల్లో రా కార్తీక్ దర్శకత్వంలో ‘మేడ్ ఇన్ కొరియా’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అదేవిధంగా ఆర్. మాధవన్, నిమిషా సజయన్ ముఖ్య తారలుగా చారుకేశ్ శేఖర్ దర్శకత్వంలో ‘లెగసీ’ (తమిళం), గోమతి శంకర్ ప్రధాన పాత్రలో మిథున్ డైరెక్షన్‌లో ‘స్టీఫెన్’(తమిళం) చిత్రాలు, అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో ‘# లవ్’(తమిళం) అనే వెబ్ సిరీస్ రూ పొందనుంది. ‘‘పైన పేర్కొన్న సినిమాలు, సిరీస్‌ల ద్వారా దక్షిణ భారత భాషల్లోని కథలను ప్రోత్సహించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం’’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మోనికా శెర్గిల్ పేర్కొన్నారు.