
సాక్షి, హైదరాబాద్: నగరంలో సినిమా పైరసీ రాకెట్ గుట్టు రట్టయ్యింది. టాలీవుడ్‌లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పుగోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనస్థలిపురంలో ఏసీ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటివరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్‌డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.
నిందితుడిపై 66(c), 66(e) ఐటీ యాక్ట్, 318(4),r/w 3(5), 338 BNS, 63, 65 కాపీ రైట్, 6-AA,6AB,7(1A) సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్ కార్డ్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్‌కుమార్.. 1TAMILBLASTERS, 5MOVIEZRULZ, 1TAMILMV వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడినట్లు తేలింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్‌లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా ఏడాదిన్నర నుంచి హైదరాబాద్‌లోని పలు థియేటర్స్‌లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సినిమా థియేటర్‌లోనే పైరసీ చేసి మాఫియాకి అమ్ముతున్న కిరణ్.. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటున్నాడు. క్రిప్టోతో పాటు బిట్ కాయిన్స్ రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాదు, గేమ్ ఛేంజర్, సినిమాల ఫైల్స్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడు కిరణ్ నుంచి రెండు మొబైల్స్‌ను సీజ్ చేశారు.
