లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి వివరణ ఇస్తున్న తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న
మాలో విప్లవతత్వం చచ్చిపోలేదు
ప్రజాపోరాటాలకు ఇప్పటికీ సిద్ధమే
నంబాల నిర్ణయం మేరకే విరమణ
అవగాహన లేని వ్యాఖ్యలు వద్దు
మాజీ మావోయిస్టు ఆశన్న ప్రకటన
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కోవర్టులుగా తమను చిత్రీకరిస్తున్న వారు, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ మావోయిస్టు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విజ్ఞప్తి చేశారు. తమలో విప్లవ తత్వం ఇంకా చనిపోలేదని, ప్రజాపోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు తనతో పాటు లొంగిపోయిన 210 మంది మావోయిస్టులతో కలిసి ఛత్తీస్‌గఢ్ నుంచి మాట్లాడిన వీడియోను ఆయన శనివారం విడుదల చేశారు. అందులో ఆశన్న పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఆయన మాటల్లోనే..
‘కేంద్ర కమిటీ స్థాయి నాయకులు లొంగిపోతే విప్లవ ద్రోహులుగా పేర్కొనడం చాన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. మాపై కూడా అలాంటి నిందలు వస్తాయని ముందే ఊహించాం. కానీ, ఇటీవల మావోయిస్టు పార్టీకి జరిగిన భారీ నష్టాలకు మేమే కారణమని, మేం కోవర్టులుగా వ్యవహరించామంటూ ఆరోపణలు రావడంతో వివరణ ఇస్తున్నా. నాకు ఏ స్వార్థం లేదు. భయం కూడా లేదు. ప్రస్తుత పరిస్థితులు సాయుధ పోరాటానికి అనుకూలంగా లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికీ మాలో విప్లవ తత్వం చచ్చిపోలేదు. ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధంగా ఉన్నాం. అయితే, కార్యాచరణ ప్రకటించేంత అనువైన పరిస్థితులు లేనందున.. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవడం ముఖ్యం.
హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటనలా?
ప్రజాస్వామిక వాదులు, పౌర హక్కుల సంఘాల నేతలు హైదరాబాద్‌లో కూర్చుని మాపై ఇష్టారీతిగా ఆరోపణలు చేస్తున్నారు. మేము సైద్ధాంతికంగా మీ అంత బాగా మాట్లాడలేకపోవచ్చు. కానీ, క్షేత్రస్థాయిలో నిలబడి మాట్లాడుతున్నాం. మేము పోరాడుతున్న గడ్డ (దండకారణ్యం)కు వచ్చి నిజాలు తెలుసుకుని మాట్లాడండి. అప్పుడే మేము ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నామో తెలుస్తుంది. అక్కడ (హైదరాబాద్) ఉండి సాయుధ పోరాటం చేయాల్సిందే అని చెబుతున్నారు. చేస్తే ఏమవుతుంది? మా శవాలు తెలంగాణకు వస్తే వాటిపై ఎర్రగుడ్డలు కప్పి ర్యాలీలు తీసి మమ్మల్ని హీరోలను చేస్తారు. కానీ ఇక్కడి(ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు) వారి సంగతేంటి?
ప్రాణత్యాగం వృధా
సమీప భవిష్యత్‌లో మన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంటే తెగించి పోరాటం చేయడంలో తప్పులేదు. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రాణత్యాగం చేయడం వృధా. విజ్ఞతతో ఆలోచన చేయండి. అనుకూలమైన పరిస్థితుల్లో ఉండి పరిధి దాటి మాట్లాడం పౌరహక్కుల సంఘం నేతలకు సరికాదు. మేము లొంగిపోయినా గుండెకోట్ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులు సాయుధ పోరాటం చేయగలరని పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ అంటున్నారు. కానీ, ఆ ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న వారు కూడా ఇప్పుడు ఇక్కడ నా వెంటే ఉన్నారు. నేనో, సోనూనో చెబితే వచ్చేంత అమాయకులు కారు వారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలియకుండా వాఖ్యలు చేయడం సరికాదు.
బీఆర్ దాదా ఉద్దేశం అది కాదు..
ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్‌లో మావోయిస్టులపై ప్రభుత్వం దాడి భీకరంగా ఉంటుందనే అంచనా ఉంది. అందుకే మార్చి 28న శాంతిచర్చల కోసం కేంద్ర కమిటీ తరఫున మన పార్టీ నాటి జనరల్ సెక్రటరీ బీఆర్ దాదా (నంబాల కేశవరావు) అనుమతితో లేఖ రాశాం. ఆ తర్వాత ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేను లేఖలు, ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో నేనేమైనా తొందరపడ్డానా అని తెలుసుకునేందుకు వ్యక్తిగతంగా బీఆర్ దాదాతో చర్చించాను.
ఈ సందర్భంగా ‘మనం తప్పు చేయలేదు. సరైన దిశలోనే ఉన్నాం. కేంద్ర కమిటీ అంతా కూర్చుని నిర్ణయం తీసుకోవాల్సింది. అలాంటి పరిస్థితి లేనప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి’అని కూడా అన్నారు. దీనికి సంబంధించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఈ అంశంపై చివరిసారి మే 18న బీర్ దాదా నుంచి నాకు లేఖ వచ్చింది. ఈ లేఖ పంపిన రెండు గంటల తర్వాతే ‘గుండెకోట్ ఆపరేషన్’మొదలైంది.
కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది
శాంతిచర్చల విషయంలో దండకారణ్యంలో అందుబాటులో ఉన్న కేంద్ర కమిటీ సభ్యుల మధ్య చర్చ జరిగింది. ఇందులో దక్షిణ బస్తర్‌లో ఉన్న కామ్రేడ్లకు సమాచారం అందకముందే శాంతి చర్చల ప్రకటన వచ్చినట్టుంది. ఇక్కడ మా మాధ్య గ్యాప్ ఏర్పడింది. శాంతిచర్చల ప్రకటన మా నుంచి వచ్చినా ప్రభుత్వం నుంచి దాడులు ఆగలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం మనం ఆయుధం పట్టవచ్చు అంటూ మే 13న బీఆర్ దాదా మరో లేఖ పంపారు.
ప్రస్తుతం ఈ లేఖను చూపించి బీఆర్ దాదా సాయుధ పోరాటానికి అనుకూలమనే వాదనను తెర మీదకు తెస్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పట్టుకోమనే బీఆర్ దాదా చెప్పారు తప్పితే అప్పటి వరకు శాంతి చర్చలు, కాల్పుల విరమణ, సాయుధ పోరాటంపై వంటి అంశాల్లో తన అభిప్రాయం మార్చుకున్నట్టు కాదు. ‘సాయుధ పోరాటం’విషయంపై నాతో పాటు మరో పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి)కి కూడా బీఆర్ దాదా లేఖ రాశారు. అందులో విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదు.
మల్లోజులతో టచ్‌లో లేను
సోను (మల్లోజుల వేణుగోపాల్)తో నేను టచ్‌లో లేను. ఆగస్టుతో పాటు అక్టోబర్ 7వ తేదీన కేవలం రెండు సార్లే ఆయనను కలిశాను. సాయుధ పోరాటం చేయాలనే ఎస్‌జెడ్‌సీ సభ్యుడి సమక్షంలోనే బహిరంగంగా ప్రజాస్వామ్యబద్దంగా నేను, సోను చర్చ జరిపాం. అందరి అభిప్రాయాల కోసం సెప్టెంబర్ 13 వరకు ఎదురు చూశాం. ఆ తర్వాత సాయుధ పోరాట విరమణ ప్రకటన వచ్చింది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకు పార్టీ పద్దతులు పాటించేందుకు ప్రయత్నించాం అని వివరించారు.


