
నవవధువు ఆత్మహత్య
తన చావుకు ఎవరూ కారణం కాదంటూ..
చేతిపై రాసుకుని ఉరేసుకున్న వైనం
మల్యాల(చొప్పదండి): కాళ్లపారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోయింది.
తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తన చావుకు తానే కారణమని తనువు చాలించింది. ‘తాను ఎవరి కారణం వల్ల చనిపోవడం లేదు.. నన్ను ఎవరూ ఏమీ అనలేదు.. నాకే ఈ లోకంలో ఉండడం ఇష్టం లేదు. అందుకే వెళ్లిపోతున్నా..’ అంటూ చేతిపై రాసుకుని ఓ నవ వధువు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో విషాదం నింపింది. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పానుటి భాగ్యలక్ష్మీకి ఇదే మండలం మ్యాడంపల్లికి చెందిన ఉదయ్‌కిరణ్‌తో గతనెల 18న వివాహమైంది.
అప్పటి నుంచి ఇద్దరూ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. ఈనెల 3న భాగ్యలక్ష్మీని తల్లిదండ్రులు పుట్టినింటికి తీసుకొచ్చారు. బుధవారం తల్లిదండ్రులు మల్యాల వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భాగ్యలక్ష్మీ బాత్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలాన్ని ఎస్సై సందర్శించారు. సంఘటనపై వివరాలు సేకరించారు. భాగ్యలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ కుమార్ తెలిపారు.