తిన్నంత అనారోగ్యం
కరీంనగర్ అర్బన్: కల్తీ రక్కసి కరీంనగర్‌ను కమ్మేసింది. తిన్నంత అనారోగ్యం పంచేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. నియంత్రించాల్సిన యంత్రాంగం మామూలుగా వ్యవహరిస్తోంది. జిల్లాకేంద్రంలో సంక్రాంతికి కల్తీ కాగుతోంది. గతంలో జరిగిన తనిఖీల్లో భారీగా కల్తీనూనె వెలుగుచూసినా పండుగకు ముందు ముందస్తు తనిఖీలు లేకపోవడం విడ్డూరం.
● జనాభా ప్రతిపాదికన పోస్టులేవీ
1985 సంవత్సరంలో అప్పటి జనాభా ప్రతిపాదికన పోస్టులను మంజూరు చేయగా నేడు జనాభా పదింతలు పెరిగినప్పటికీ అదే విధానం కొనసాగడం విడ్డూరం. పోనీ అప్పటి మంజూరు పోస్టుల ప్రకారం అధికారులున్నారా.. అంటే అదీ లేదు. దీంతో ఆహార తనిఖీ ప్రక్రియ అటకెక్కడంతో కల్తీ మాఫియా ప్రజల ప్రాణాలతో రాజ్యమేలుతోంది.
● పండగల పూట రూ.కోట్లలో దందా
వీలైనంత మేర కల్తీ చేసి పొద్దుతిరుగుడు, పల్లీ నూనె పేరుతో విక్రయిస్తున్నారు. సంక్రాంతి, బతుకమ్మ, దసరా, ఏకాదశి పండుగల సమయాల్లో భారీగా వ్యాపారం సాగుతోంది. నగరంలోని ప్రకాశంగంజ్, మంకమ్మతోట, రాంనగర్ ప్రాంతాల్లో ఎక్కువగా కల్తీ విక్రయాలు సాగుతున్నాయని సమాచారం. చింతకుంట, బొమ్మకల్, బైపాస్ ప్రాంతాల్లోని గోడౌన్లలో విడినూనెను దించుకోవడం అక్కడి నుంచి ప్యాకెట్లు, డబ్బాల్లో నింపి దుకాణాలకు తరలించడం తంతుగా సాగుతోంది. హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని పలువురు వ్యాపారులు భారీగా నిల్వలు చేశారు.
● విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేస్తేనే సరి
గతంలో వివిధ శాఖల అధికారులతో పౌరసరఫరాల విజిలెన్స్ విభాగం ఉండేది. ఆహార తనిఖీలపై ప్రధానంగా దృష్టిసారించి కఠినచర్యలు తీసుకునేవారు. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ కల్తీ వ్యాపారులకు చెమటలు పట్టించేవారు. 2001 వరకు సదరు విభాగం పనిచేయగా 2002లో రద్దు చేశారు. నామమాత్రంగా ఉన్న ఆహార తనిఖీ విభాగం కూడా అదే స్థితికి చేరబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంక్రాంతి పూట భారీగా నూనె కల్తీ తూకంలోనూ మోసాలు
వసూళ్లు తప్పా పట్టించుకునే దిక్కేది..?
కల్తీరాయుళ్లకు కాసులే కాసులు
నాణ్యమైన నూనెల విక్రయాలు, ధరల నియంత్రణ, జీరో వ్యాపారాన్ని నియంత్రించడంలో అధికారుల మధ్య సమన్వయలోపం వ్యాపారులకు కల్పతరువుగా మారింది. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు లక్షల్లో మామూళ్లు వసూళ్లు చేయడం..దందాను ప్రొత్సహించడం జరుగుతుందని సమాచారం. 5 క్వింటాళ్ల కంటే ఎక్కువ నూనె నిల్వ చేసుకుంటే పౌరసరఫరాల శాఖ అనుమతి తప్పనిసరి. హోల్‌సేల్ వ్యాపారులు జిల్లాకేంద్రంలో అయితే 600ల క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో అయితే 377 క్వింటాళ్లు, జిల్లా కేంద్రంలో రిటైల్ అయితే 50 క్వింటాళ్లు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్లు నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే అనుమతి లేని దుకాణాలు వందల్లో ఉన్నాయని తెలుస్తోంది. ఒక్క జిల్లాకేంద్రంలోనే 80వరకు దుకాణాలను నిర్వహిస్తున్నారు. పలువురు వ్యాపారులలో హోల్‌సేల్ వారే రిటైల్ వారని సమాచారం. ఇక విక్రయాలకు సంబంధించి కమర్షియల్ టాక్స్, కల్తీకి సంబంధించి ఆహార నియంత్రణశాఖలకు సంబంధం కాగా ఆయా శాఖల మధ్య సమన్వయం లోపించడం దారుణ పరిణామం. నిల్వలకు మాకు సంబంధమని పౌరసరఫరాల అధికారులు, కల్తీయే మాకు సంబంధమని ఆహార నియంత్రణ అధికారులు, విక్రయాలకే సంబంధమని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతూ చేతులు దులుపుకుంటున్నారు. పోనీ వారి వారి పరిధిలోనైనా కేసులు నమోదు చేశారా.. అంటే అదీ లేదు. అయితే తనిఖీలు నిర్వహిస్తామని, కల్తీ వ్యాపారాన్ని అరికడుతామని ఆహార నియంత్రణ, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులు చెబుతున్నారు.


